Hari Hara Veera Mallu VFX :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ 'హరిహర వీరమల్లు'. పవన్ లైనప్‌లో ఫ్యాన్స్ ఎంతగానో ఎదుచూస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. అయితే గత కొంతకాలంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. మూవీ గురించి అనేక అనుమానాలను వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపేందుకు ఈ మూవీ నిర్మాణ సంస్థ మెగాసూర్య ప్రొడక్షన్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు' మూవీ హై ఎండ్ వీఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటోందని దీని కోసం ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రదేశాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు ఈ మూవీ గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నారంటూ తెలిపారు. అద్భుతమైన గ్రాఫిక్స్ నైపుణ్యానికి అద్దం పట్టేలా, ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో పలు సీన్స్‌ను గ్రాఫిక్స్‌తో రూపొందించి సరికొత్త థ్రిల్ ను అందిస్తామని చిత్రబృందం ప్రకటించింది. అంతే కాకుండా త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకురానున్నట్లు తెలిపారు.
ఇది విన్న పవన్ ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా గురించి ఆందోళన చెందినవారు ఊపిరి పీల్చుకుంటున్నారు. త్వరగా ప్రోమో రిలీజ్ చేయాలంటూ మేకర్స్‌ను కామెంట్ల రూపంలో రిక్వెస్ట్ చేస్తున్నారు.