Puri Jagannath Double Ismart:ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజ్ సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం (ఆగస్టు 11) వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన లైఫ్‌లోని ఓ ఎమోషనల్ మూమెంట్ షేర్ చేసుకున్నారు. తాను దర్శకత్వం వహించిన ఓ సినిమా ఫ్లాప్ అవ్వగా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి మాట్లాడిన సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
'హిట్ సినిమా తీస్తే చాలామంది ఫోన్ చేసి ప్రశంసిస్తారు. ఫ్లాప్ సినిమా విషయంలోనూ నాకు ఓ కాల్ వచ్చింది. సినిమా ఫ్లాఫ్ అయిన వారం తర్వాత విజయేంద్ర ప్రసాద్ నాకు ఫోన్ చేశారు. 'నాకో సాయం చేస్తారా?' అని అడిగారు. 'ఆయన కొడుకు రాజమౌళే పెద్ద డైరెక్టర్. నేనేం హెల్ప్ చేయాలి?' అని మనసులో అనుకున్నా. 'తదుతరి చిత్రం ఎప్పుడు చేస్తున్నారు? మీరెప్పుడు చేసినా ఆ సినిమా కథ నాకు చెబుతారా?' అని అడిగారు. ఆయనెందుకు అలా అంటున్నారో కొంచెం అర్థమైంది. 'మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి' అని అన్నారు. ఆయన మాటలతో భావోద్వేగానికి గురయ్యా. నాపై అభిమానంతో చేసిన ఆ కాల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. అయితే, ఈ స్టోరీ గురించి ఆయనకు చెప్పలేదు. జాగ్రత్తగా తెరకెక్కించి సినిమానే చూపించాలనుకున్నా' అని అన్నారు. తనపై ప్రేమ, అభిమానంతోనే విజయేంద్ర ప్రసాద్ ఆ ఫోన్ చేశారని పూరి తెలిపారు.