Puri Musings Podcast :టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన పాడ్‌కాస్ట్‌లో 'పూరి మ్యూజింగ్స్' పేరుతో ఈ మధ్య వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు. ఆయా అంశాలపై ఆయన తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. వీటిని ఆయన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేస్తున్నారు. దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ కూడా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా 'కన్‌జ్యూమింగ్' అనే అంశంపై ఆయన మాట్లాడారు. మన ఆలోచనలే మనపై ప్రభావం చూపుతాయని, రోజూ నాలెడ్జ్ పొందకపోయినా ఫర్వాలేదు కానీ, నాన్సెన్స్ మాత్రం తలకు ఎక్కించుకోవద్దని పేర్కొన్నారు.
'చైనాలో లావోజ్ అనే ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఉండేవాడు. 'నీ ఆలోచనలను గమనిస్తూ ఉండు. అవే నీ మాటలవుతాయి, నీ మాటలే నీ పనులు అవుతాయి. నీ పనులే నీ అలవాట్లు అవుతాయి. అదే నీ క్యారెక్టర్ అవుతుంది. నీ క్యారెక్టర్ డెస్టినీ అవుతుంది' అని అతను ఒక మంచి మాట చెప్పాడు. మరి మనకు ఆలోచనలు ఎలా వస్తాయి? చదవటం, వినడం, చూడటం, ఫ్రెండ్స్‌తో తిరగడం వల్ల వస్తాయి. మనం రోజూ దేనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామో అవే ఆలోచనలు వస్తుంటాయి. పుస్తకాలు, వీడియోలు, సంభాషణలు ఇవన్నీ మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి. పనికి రాని వెధవలతో తిరిగి, పనికిరాని వీడియోలు చూస్తూ రోజూ వాళ్ల గురించి, వీళ్ల గురించి పనికి రాని విమర్శలు చేస్తూ ఉంటే అతి తక్కువ కాలంలో మీరు కూడా సక్సెస్‌ఫుల్‌గా ఎందుకూ పనికి రాకుండా పోతారు'