Bollywood Actor Beer Business : చాలా మంది బాలీవుడ్ నటులు స్టార్టప్స్, ప్రొడక్షన్ హౌస్, ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టారు. అయితే బాలీవుడ్‌కు చెందిన ఓ సీనియర్ యాక్టర్, విలన్ బ్రూవరీస్లో పెట్టుబడులు పెట్టి అదరగొట్టారు. ప్రస్తుతం వ్యాపారంలో రాణించి ఏకంగా భారతదేశంలోని 3వ అతిపెద్ద బీర్ బ్రాండ్‌కు యజమానిగా ఉన్నారు. ఆయన ఎవరు? ఆస్తులెంత తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
5 దశాబ్దాల కెరీర్- పద్మశ్రీ సొంతం
హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ సహా పలు అంతర్జాతీయ ప్రాజెక్ట్స్‌లో నటించిన బాలీవుడ్ యాక్టర్ డానీ డెంజోంగ్పా. 1971లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన దాదాపుగా 190 సినిమాల్లో నటించారు. అందులో హాలీవుడ్ సినిమాలు సైతం ఉన్నాయి. అలాగే హిందీ, బెంగాళీ, తమిళం భాషల్లోనూ నటించారు. గత ఐదు దశాబ్దాలుగా హిందీ చిత్రసీమలో మంచి నటుడిగా డానీ డెంజోంగ్పా పేరు సంపాదించుకున్నారు. అంతలా ఆయన తన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. ఆయన నటనకు భారత ప్రభుత్వం 2003లో పద్మశ్రీ అవార్డు ఇచ్చింది.
సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్
డానీ డెంజోంగ్పా మంచి నటుడే కాదు సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త కూడా. ఈయన ఈశాన్య రాష్ట్రాల్లో బీర్ల వ్యాపారం చేసి మంచి లాభాలను అర్జిస్తున్నారు. 1987లో దక్షిణ సిక్కింలో 'యుక్సోమ్ బ్రూవరీస్'ను స్థాపించారు. ఇందులో హీమ్యాన్ 9000, డాన్స్బెర్గ్ డైట్, డాన్స్బెర్గ్ 90000, డాన్స్బెర్గ్ 16000 వంటి బీర్ బ్రాండ్స్ తయారువుతాయి. అలాగే డానీ డెంజోంగ్పా 2005లో ఒడిశాలో డెంజాంగ్ బ్రూవరీస్ అనే పేరుతో మరో వ్యాపారాన్ని స్థాపించారు. అయితే 2009లో డెంజోంగ్పా అసోంకు చెందిన రైనో ఏజెన్సీస్‌ను దాదాపు రూ.40 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బీర్ల వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. కాగా, డానీ డెంజోంగ్పా ఆస్తి 10 మిలియన్ డాలర్లు(రూ.83 కోట్లు) అని తెలుస్తోంది.
డానీ డెంజోంగ్పాకి చెందిన మూడు బ్రూవరీలు ఏటా 6.8 లక్షల హెచ్ఎల్ ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. దక్షిణ సిక్కింలోని 'యుక్సోమ్ బ్రూవరీస్' భారతదేశంలో మూడవ అతిపెద్ద బీర్ కంపెనీగా నిలిచింది. ఈశాన్య ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ప్రతి ఏటా సుమారు రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఇది అందిస్తుంది.
సంజయ్ దత్ సైతం
కాగా, గతంలో బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ కూడా విస్కీ వ్యాపారాన్ని ప్రారంభించారు. జార్జ్ క్లూనీ, డ్రేక్, డ్వేన్ జాన్సన్, నిక్ జోనాస్ (ప్రియాంక చోప్రా భర్త), ర్యాన్ రేనాల్డ్స్ వంటి ప్రముఖ వ్యక్తులు తమ సొంత బ్రాండ్‌లతో స్పిరిట్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.