Citadel Webseries Samantha :హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫిట్‌గా మారింది. వరుసగా ఫొటో షూట్స్‌తో అదరగొడుతోంది. అలానే ప్రస్తుతం తన ఇండియన్ వెర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లోనూ జోరుగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా గతంలో తను ఎదుర్కొన్న శారీరక కష్టాల్ని, రుగ్మతల్ని మరోసారి గుర్తు చేసుకుంటోంది.
ఆ మధ్య సమంత మయొసైటిస్తో బాధపడిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఆ బాధను భరిస్తూనే మరోవైపు సిటాడెల్ షూటింగ్లలో పాల్గొంది. సిటాడెల్ సిరీస్ కూడా అలానే నటించింది. అయితే అనంతరం చిత్రీకరణలకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రొఫెషనల్ వర్క్‌లో బిజీ అవుతోంది. అయితే తాజాగా సిటాడెల్ షూటింగ్ సమయంలో కొన్ని సార్లు తనకు తల తిరగడం, మరికొన్నిసార్లు మూర్ఛపోవడం లాంటివి జరిగాయని గుర్తుచేసుకుంది.
"ప్రతి ఒక్కరికీ జీవితంలో చీకటి రోజులు అనేవి ఉంటాయి. వాటిని భరించి ఓర్పుతో ముందుకెళ్తేనే కెరీర్ చాలా అందంగా ఉంటుంది. నాకు మయోసైటిస్ క్రమ క్రమంగా తగ్గుతోంది. మానసికంగా బలంగా ఉంటేనే దేన్నైనా జయించవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాను. ఈ సమస్య వల్ల సిటాడెల్ షూటింగ్ ఎంతో క్లిష్టంగా అనిపించింది. శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటకీ, సిరీస్‌లో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలిసినా ఒప్పుకున్నాను. ఒకరోజు యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నాలో శక్తి నశించింది. చాలా నీరసంగా అయిపోయాను. స్పృహ తప్పి కూడా పడిపోయాను. దీంతో సెట్లో అందరూ టెన్షన్ పడ్డారు. ఈ సిరీస్ షూటింగ్‌ను ఎంతో కష్టపడి పూర్తి చేశానో నాకు మాత్రమే తెలుసు. అందుకే నా కెరీర్‌లోనే ఇది ఎంతో స్పెషల్. దీని రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పింది.