Chiranjeevi Padma Vibhushan : పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన కొణిదెల శివ శంకర వరప్రసాద్‌కి చదువుకునే వయసులోనే యాక్టింగ్ వైపుకు దృష్టి మళ్లింది. అలా మద్రాసులోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నప్పుడే 'పునాదిరాళ్లు' సినిమాతో తొలి అవకాశాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 'ప్రాణం ఖరీదు'. 'మనవూరి పాండవులు', 'శ్రీరామ బంటు', 'కోతల రాయుడు', 'తాయారమ్మ బంగారయ్యా', 'కొత్త అల్లుడు', 'పున్నమినాగు', 'చట్టానికి కళ్లు లేవు', 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య', 'శుభలేఖ', 'అభిలాష', 'గూఢచారి నెం.1', 'మగ మహారాజు' ఇలా పలు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని దూసుకెళ్లారు.
ఇక 1983లో విడుదలైన 'ఖైదీ' సినిమా చిరు జర్నీలో ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ సినిమా విజయం ఆయన్ను ఓ యాక్షన్ హీరోగా నిలబెట్టింది. 'గూండా', 'సంఘర్షణ', 'ఛాలెంజ్', 'ఇంటిగుట్టు', 'చట్టంతో పోరాటం', 'విజేత', 'దొంగ', 'అడవి దొంగ', 'కొండవీటి రాజా', 'మగధీరుడు', 'రాక్షసుడు', 'జేబుదొంగ', 'దొంగమొగుడు', 'పసివాడి ప్రాణం', 'త్రినేత్రుడు', 'రుద్రవీణ', 'యుద్ధభూమి', 'యముడికి మొగుడు', 'ఖైదీ నంబర్ 786', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'స్టేట్ రౌడీ' ఇలా సినిమా ఏదైనా తన నటనతో ప్రేక్షకులకు ఆయన మెగాస్టార్‌గా మారిపోయారు.
బాక్సులు బద్దలైపోవాల్సిందే : 90స్లో చిరు సరికొత్త రికార్డుల్ని సృష్టించి తెలుగు చిత్రసీమ స్థాయిని పెంచాయి. 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'రౌడీ అల్లుడు', 'గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు', 'అల్లుడా మజాకా', 'రిక్షావోడు', 'హిట్లర్', 'చూడాలని ఉంది', 'బావగారూ బాగున్నారా?', 'అన్నయ్య','డాడీ', 'ఇంద్ర', 'ఠాగూర్', 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్' ఇలా వరుస విజయాల్ని అందుకున్నారు. అయితే ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 2007 తర్వాత నటనకి దూరమయ్యారు. అయితే ఆ తర్వాత 2017లో 'ఖైదీ నంబర్ 150' సినిమాతో మరోసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీలోనూ సూపర్ హిట్ అందుకున్న ఆయన 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్‌ఫాదర్', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేశారు.