Bollywood Actor With Most Grossers : సినీ ఇండస్ట్రీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. అటు టాలీవుడ్‌తో పాటు ఇటు బాలీవుడ్‌లోనూ మంచి మంచి సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు మేకర్స్ కూడా తమ పరిధిని దాటి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో వాటిని రిలీజ్ చేస్తూ వసూళ్లను కొల్లగొడుతున్నారు. కొన్ని సార్లు స్టోరీ వల్ల వసూళ్లు వస్తే, మరికొద్ది సార్లు సినిమా హీరోలు కూడా ఆయా చిత్రానికి అత్యథిక కలెక్షన్లు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే బాలీవుడ్లో ఇప్పటి వరకు తన సినిమాలతో అత్యధిక వసూళ్లు సాధించిన నటుడు ఒకరు ఉన్నారు. ఆయనెవరో కాదు దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్.
బాలీవుడ్లోనే కాకుండా యావత్ భారత్ మొత్తంలోనూ తన నటనతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఇర్ఫాన్. ఈయన సినిమాలు ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ. 25,000 కోట్లకు పైగా గ్రాస్ సాధించాయి. ఈయన నటించిన 'పాన్ సింగ్ తోమర్' సినిమాకుగానూ ఆయన జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా హాలీవుడ్‌లోనూ తను నటించిన చిత్రాలు అస్కార్ గెలవటమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించాయి. 'జురాసిక్ వరల్డ్', 'అమెజింగ్ స్పైడర్ మాన్' , 'స్లమ్ డాగ్ మిలియనీర్' , 'లైప్ ఆఫ్ ఫై' లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ నాలుగు చిత్రాలకు కలిపి వచ్చిన వరల్డ్ వైడ్ గ్రాస్ 2.5 బిలియన్ డాలర్లు అంటే అక్షరాలు రూ. 22,350 కోట్లు పైచిలుకే. వాటితో పాటు మిగతా చిత్రాలు కలుపుకుంటే ఆ మెుత్తం రూ. 25,000 వేల కోట్లు.