Bigg Boss 8 Telugu Abhai Naveen Elimination:రెండు వారాలు కాస్త చప్పగ సాగినా .. మూడో వారం నుంచి బిగ్‌బాస్ సీజన్ 8 ఆట స్వరూపమే మారిపోయింది. ప్రభావతి 2.0తో షోను మలుపు తిప్పారు నిర్వాహకులు. గుడ్ల కోసం టాస్కులు, కంటెస్టెంట్ల గొడవలు, మితిమీరిన డైలాగులు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఈ వారంలో జరిగాయి. అయితే బిగ్‌బాస్ హౌజ్‌లో రాణించాలంటే ఆట, మాట రెండూ ఇంపార్టెంట్. వీటిలో ఏది తక్కువైనా ఇంటి బయటకు వెళ్లాల్సిందే. తాజాగా అభయ్ నవీన్ విషయంలో జరిగింది కూడా ఇదే. గత రెండు వారాలు ఆటతో, మాటతో రాణించిన అభయ్.. చీఫ్ పదవి చేపట్టి చీప్ అయిపోయాడు. దీంతో టాప్ 5లో ఉంటాడనుకున్న వ్యక్తి.. మూడో వారానికే బ్యాగ్ సర్దేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతని రెమ్యూనరేషన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూస్తే..
ఎలిమినేషన్ ఇలా జరిగింది: శనివారం ఫుల్ ఫైర్ మీద ఉన్న నాగార్జున.. కంటెస్టెంట్లను ఏకిపారేశారు. ఇక ఆదివారం హౌస్‌లో సండే-ఫన్‌డే ఎపిసోడ్ బాగా ఎంటర్‌టైనింగ్‌గానే సాగింది. ఇక గేమ్ మధ్య మధ్యలో నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వెళ్లారు నాగార్జున. ఇక చివరికి డేంజర్ జోన్‌లో ఉన్న పృథ్వీ, అభయ్ ఇద్దరినీ యాక్టివిటీ ఏరియాలోకి పిలిచారు. అక్కడ ఎవరి కాళ్ల కింద రెడ్ లైట్ వస్తే వాళ్లు ఎలిమినేట్ అన్నారు. అందరూ ఊహించినట్లే అభయ్ ఎలిమినేట్ కాగా పృథ్వీ సేవ్ అయ్యాడు.
నిజానికి శనివారం ఎపిసోడ్‌లోనే అభయ్‌కి రెడ్ కార్డ్ ఇచ్చి గెట్ ఔట్ అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు. అసలు బిగ్‌బాస్ తెలుగు హిస్టరీలోనే ఇలా రెడ్ కార్డ్ ఎవరికీ ఇవ్వలేదు. అయినా సరే మిగిలిన కంటెస్టెంట్ల రిక్వెస్ట్ కారణంగా అభయ్‌ని క్షమించారు నాగ్. కానీ ఈ వారం తక్కువ ఓటింగ్ కారణంగా నామినేషన్లలో ఉన్న అభయ్ ఎలిమినేట్ అయ్యాడు.
బిగ్‌బాస్ 8: వైల్డ్‌కార్డ్ ఎంట్రీ బ్యాచ్ సిద్ధం! - వచ్చేది వీళ్లేనటగా!
ఎలిమినేషన్‌కు ఇవన్నీ కారణాలే:ఈ వారం తన గొయ్యి తానే తవ్వుకున్నాడు అభయ్. ఎందుకంటే చీఫ్ అయిన కారణంగా అభయ్‌కి సేఫ్ అయ్యే అవకాశం దక్కింది. నిఖిల్, అభయ్ ఇద్దరూ చీఫ్‌లుగా ఉండటంతో ఎవరో ఒకరు నామినేషన్‌లోకి రావాలని.. అది మీరే చర్చించుకొని చెప్పడంటూ బిగ్‌బాస్ చెప్పాడు. నిఖిల్ తాను వెళ్తానని చెప్పినా సరే వద్దు "నా పెర్ఫామెన్స్, నా ఫాలోయింగ్, నా స్ట్రెంథ్ ఎంతుందో నేను చూసుకోవాలి.. నేను ఇప్పటివరకూ నామినేషన్‌లోకి పోలేదు" అంటూ తనని తానే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు అభయ్. దీంతో తొలిసారి నామినేషన్లలోకి వచ్చాడు.