Ayodhya Ram Mandir Chiranjeevi:జనవరి 22 అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి హాజరు కావాలంటూ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి తాను వెళ్లనున్నట్లు ఇప్పటికే చిరు ప్రకటించారు కూడా. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన కోసం ఆంజనేయస్వామి పంపిన ఆహ్వానంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. "చరిత్ర సృష్టించేలా- చరిత్రను పునరావృతం చేసేలా- చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా అయోధ్యలో జరిగే రామలల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అందిన ఆహ్వానం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇది నిజంగా గొప్ప అనుభూతి" అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆనందోత్సహంతో ట్వీట్ చేశారు.
"ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న మహత్తర అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. అంజనాదేవి కుమారుడు 'చిరంజీవి' అయిన ఆ హనుమాన్ భువిపై ఉన్న ఈ అంజనాదేవి కుమారుడనైన నాకు ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు అనిపిస్తోంది. దీనిని మీతో పంచుకోవడానికి నాకు మాటలు రావడం లేదు. నాకు నా కుటుంబసభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇంత మహోన్నత కార్యక్రమం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఉత్తర్ ప్రదేశ్ముఖ్యమంత్రి యోగిజీకి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు. రేపటి ఆ బంగారు క్షణాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. జై శ్రీరామ్" అని చిరు రాసుకొచ్చారు.