Tollywood producers Donations Telugu States Floods : తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితుల సహాయార్థం భారీ విరాళాలను ప్రకటించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇబ్బందులపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. కమిటీ ఇచ్చే సమాచారంతో సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. అన్ని థియేటర్ల దగ్గర విరాళాలు, వస్తువుల సేకరణ కోసం ఓ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు పలువురు నిర్మాతలు కూడా వ్యక్తిగతంగా విరాళాలను ప్రకటించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ రెండు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షలు ప్రకటించగా, తెలుగు నిర్మాతల మండలి చెరో రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపింది.
దగ్గుబాటి ఫ్యామిలీ తరఫున రెండు రాష్ట్రాలకు నిర్మాత సురేశ్ బాబు రూ.కోటి ప్రకటించారు. మరో నిర్మాత దిల్ రాజు రెండు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు.
"ఇలాంటి విపత్తు సమయంలో అండగా ఉండేందుకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుంది. ప్రజలకు ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా చేయూత అందిస్తుంటుంది. డబ్బులే కాకుండా నిత్యావసరాలు కూడా అందించే ప్రయత్నం చేస్తాం." అని నిర్మాత సురేశ్ బాబు పేర్కొన్నారు.
- ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్
"వరద బాధితులకు ఇప్పటికే చాలా మంది హీరోలు విరాళాలను ప్రకటించారు. మేం ఛాంబర్ తరఫున సాయం చేయాలని అనుకున్నాం. ఇండస్ట్రీలోని ప్రతిఒక్కరూ ముందుకొచ్చి ఫెడరేషన్ నెంబర్‌కు విరాళాలను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం."
- నిర్మాత దిల్ రాజు.