Anchor Suma Birthday : తెలుగు యాంకర్లలో స్టార్ యాంకర్ ఎవరంటే అంతా సుమ పేరును ఠక్కున చెప్పేస్తారు. తెలుగు ఆడపడచు కాకపోయినా తెలుగుని స్పష్టంగా మాట్లాడటంలో ఆమెకు ఆమె సాటి. మాటలతోనే కోటలు కడుతుంటారు ఆమె. అదే మాటలతోనే ఆకట్టుకోవడంలోనూ ఆమె సాటి ఎవరూ లేరని చెప్పవచ్చు. యాంకరింగ్‌లో తనదైనశైలితో దూసుకుపోతుంటారు. యాంకరింగ్ అంటే సుమ. సుమ అంటే యాంకరింగ్ అనేంత పేరు సంపాదించుకున్నారు. ఆమె నవ్విస్తూనే అందర్నీ ఆలోచింపచేస్తుంటారు. భాషపై ప్రేమను పెంచుతుంటారు. తెలుగమ్మాయి కానప్పటికీ, మన సంప్రదాయాల విలువేంటో చాటి చెబుతుంటారు. మార్చి 22న సుమ కనకాల పుట్టినరోజు. ఈ సందర్భంగా బుల్లితెర మహారాణి అని నిరూపించిన సుమ గురించి కొన్ని విశేషాలు మీ కోసం.
ఆ లవ్ లెటర్ :
స్టూడెంట్ లైఫ్‌లో తనకొచ్చిన ఓ లవ్ ప్రపోజల్ గురించి సుమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు ఓ కుర్రాడు లవ్ లెటర్ ఇచ్చిన విషయాన్ని ఆ సందర్భంగా చెప్పుకొచ్చారు. అతడు సైన్స్ స్టూడెంట్ అని, పూర్తిగా సైంటిఫిక్ పదాలతో రాశాడని, అంతే కాకుండా ఆ ప్రేమ లేఖలో 'నీ ప్రేమ నన్ను గురుత్వాకర్షణ శక్తివలే లాగుతోంది' అని రాశాడంటూ నవ్వుకున్నారు. ఆ తర్వాత అతన్ని ఆమె అన్నయ్య అని పిలిచానంటూ చెప్పుకొచ్చారు సుమ. 'మా అమ్మాయిల దగ్గర ఉండే అస్త్రం అదే' అంటూ నవ్వారు.
ఆ యాంకర్‌ను చూస్తేఅసూయ:
సుమ స్టార్ యాంకర్. కానీ తాను కూడా ఓ యాంకర్‌ను చూసి జెలసీగా ఫీలయ్యారని చెప్పుకొచ్చారు. "ఈర్ష్య లేని మనిషి ఉంటే అదివేరే స్థాయిలో ఉండాలి. కానీ అలా ఉండటం చాలా కష్టం. ప్రతి మనిషిలోనూ ఈర్ష్య కలుగుతుంది. నాకు యాంకర్ అనసూయను చూసినప్పుడు ఈర్ష్య కలిగింది. అలా ఈర్ష్య అనను కానీ తనంత ఎత్తు లేనని అనిపించింది. అయిన అది అమ్మాయిలకు స్వతహాగా వచ్చే చిన్నపాటి కుల్లు" అంటూ చెప్పుకొచ్చారు సుమ.