Shriya Reddy On Prashanth Neel:ప్రశాంత్ నీల్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'సలార్'తో మళ్లీ తెరపై మెరిసింది చెన్నై బ్యూటీ శ్రియా రెడ్డి. ఈ సినిమాలో 'రాధా రామ' అనే పవర్ఫుల్ లేడీ విలన్ పాత్రలో కనిపించి ఆడియెన్స్ మెప్పించింది. సాలార్‌లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రియా, డైరెక్టర్ ప్రశాంత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. సలార్ షూటింగ్ సమయంలో ఒక్కోసారి ఆయనను చంపేయాలనేంత కోపం వచ్చేదని చెప్పింది.
'నేను ప్రతి రోజూ ప్రశాంత్ నీల్‌ను అడిగేదాన్ని. సలార్ కథలో నా పాత్ర గురించి పూర్తిగా చెప్పమని విసిగించేదాన్ని. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి లీడ్ హీరోలతో పాటుగా పర్‌ఫార్మెన్స్ ఉండాలనే తపనతోనే అలా ప్రశ్నలు వేసేదాన్ని. నేను ఏ సీన్‌లో కనిపిస్తానో చెప్పి, దానికి సంబంధించిన డైలాగులు నాకిస్తే నేను ప్రిపేర్ అవుతాను కదా. సినిమా సెట్‌లో ప్రతి ఒక్కరికీ సీన్ గురించి తెలియాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ, ఒక నటిగా నాకు తెలియాలి కదా'?
'పెద్ద సినిమాలో నటించే అవకాశం దొరికిందని చాలా మంది నటులు సరిపెట్టుకుంటారు. కానీ, పాత్ర గురించి పూర్తిగా తెలుసుకునేందుకు మనకున్న సందేహాలు వ్యక్తం చేసినప్పుడే తేడా తెలుస్తుంది. నేను సెట్స్ కి వెళ్లిన ప్రతీసారి ఇదే చేసేదానిని. ప్రశాంత్ నీల్‌కు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఆయన సెట్స్‌కు వెళ్లాక గానీ, డైలాగ్స్ రాయరు. ఆ పనికి నాకు చిరాకొచ్చేసేది. చంపేయాలనేంత కోపం వచ్చేది. నాకు, నా డైలాగులు నేర్చుకునేంత సమయమైనా ఇవ్వాలి కదా. పైగా, నాకు ప్రాంప్టింగ్ అస్సలు నచ్చదు. క్యారెక్టర్ పోషిస్తున్నామంటే అందులో పూర్తిగా ఇమిడిపోవాలని భావిస్తాను. అప్పుడే ఆ పాత్ర ప్రేక్షకుడిని మెప్పించగలదని నా నమ్మకం' అని శ్రియా రెడ్డి సలార్ షూటింగ్లో తన అనుభవాల్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.