Hero Faced Body Shaming :ఆయన బాలీవుడ్లో ఓ నిర్మాత. తన తండ్రి, సోదరి కూడా ప్రొడ్యూసర్లే. పుట్టింది సంపన్న కుటుంబంలో. కానీ ఒబెసిటీ కారణంగా వల్ల చాలా లావుగా తయారయ్యారు. దాని వల్ల ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నారు. అయితే తర్వాతి కాలంలో అందుకు పూర్తి భిన్నంగా ఫిట్‌గా తయారయ్యారు. అంతేకాకుండా ఓ హీరోయిన్ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంతకీ ఆయనెవరంటే?
సినీ బ్యాక్‌గ్రౌండే కానీ!
జాకీ భగ్నానీ అంటే ఓ ప్రొడ్యూసర్, యాక్టర్ అని బీటౌన్ వారికి తెలుసు. కానీ సౌత్‌లో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ భర్త అంటే ఇట్టే కనిపెట్టేస్తారు. తండ్రి వాసు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్ సైతం నిర్మాతలుగానే బాలీవుడ్లో రాణిస్తున్నారు. అయితే జాకీ మాత్రం ప్రోడ్యూసర్ కాకముందు యాక్టర్‌గా పలు సినిమాల్లో మెరిశారు. అయితే సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, ఇండస్ట్రీలోకి రావడాని ముందు తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
తను ఓ అస్తమా పేషంట్ అని, అప్పట్లో సుమారు 130 కిలోల బరువు ఉండేవారని చెప్పుకొచ్చారు. దాని కారణంగా తనను చాలా మంది ఎగతాళిగా చూసేవారని పేర్కొన్నారు. అంతేకాకుండా తనను ఏ అమ్మాయీ ప్రేమించదని తాను భావించినట్లుగా వెల్లడించారు. అయితే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, ఫిట్‌గా మారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
2009లో 'కల్ కిస్నే దేఖా' అనే సినిమాతో బీటౌన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2011లో F.A.L.T.U అనే కామెడీ సినిమా తీశారు. వీటితో పాటు 'అజబ్ గుజబ్ లవ్', 'రోగ్రెజ్', 'యంగిస్థాన్', 'వెల్కమ్ టు కరాచీ', 'మిత్రో' వంటి సినిమాల్లో నటించారు. 2016లో తమ సొంత బ్యానరైన 'పూజా ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్'లో 'సర్బ్జిత్' అనే సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత 'జవానీ జానేమన్', 'కూలీ నంబర్.1', 'బెల్ బాటమ్', 'కట్‌పుత్లి', 'మిషన్ రాణిగంజ్', 'గణ్‌పత్', 'బడే మియన్ ఛోటే మియన్' లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.ఇక జాకీకి 'Jjust Music' అనే సొంత మ్యూజిక్ సంస్థ కూడా ఉంది.