Mohanlal On AMMA:మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక ఇటీవల వివాదస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో కేవలం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) ను లక్ష్యంగా చేసుకోవద్దని అమ్మ మాజీ అధ్యక్షుడు, నటుడు మోహన్ లాల్ విజ్ఞప్తి చేశారు. మాలీవుడ్‌లో పవర్ గ్రూప్ గురించి తనకు తెలియదని, తాను అందులో భాగం కాదని తిరువనంతరపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే?
జస్టిస్ హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని మోహన్ లాల్ పేర్కొన్నారు. ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనదేనని అన్నారు. 'అన్ని ప్రశ్నలకు అమ్మ (AMMA) సమాధానం ఇవ్వడం సాధ్యం కాదు. మలయాళ చిత్ర పరిశ్రమ చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ. అలాగే పెద్ద ఇండస్ట్రీ కూడా. ఇందులో వేలాది మంది ఉన్నారు. అందరినీ నిందించలేం. జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిశీలిస్తున్నాం. విచారణ ప్రక్రియకు సహకరిస్తాం. మాలీవుడ్‌లో మహిళలపై లైంగిక వేధింపులపై దర్యాప్తు జరుగుతోంది. దోషులకు శిక్ష తప్పదు. దయచేసి పరిశ్రమను నాశనం చేయకండి' అని మోహన్ లాల్ మీడియాతో వ్యాఖ్యానించారు.
అధ్యక్ష పదవికి రాజీనామా
కాగా, మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులపై ఇటీవలే జస్టిస్ హేమ కమిటీ నివేదిక సమర్పించింది. అందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం వల్ల అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్ కొద్ది రోజుల క్రితం రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులు కూడా పదవుల నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని 'అమ్మ' సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది.