తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ISROలో ఇంటర్న్​షిప్ చేయాలా? అర్హతలు, దరఖాస్తు విధానం వివరాలు ఇవిగో! - ISRO INTERNSHIP 2025

స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలపై అమితమైన ఆసక్తి ఉన్న విద్యార్థులకు గుడ్ న్యూస్​- ఇస్రోలో ఇంటర్న్​షిప్​ అవకాశాలు- అప్లై ఎలా చేసుకోవాలంటే!

ISRO Internship 2025
ISRO Internship 2025 (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2025, 2:34 PM IST

ISRO Internship 2025 :భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఇంటర్న్‌షిప్‌ చేసే గొప్ప అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్, అంతరిక్ష పరిశోధన, సాంకేతిక విభాగాల్లో ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఆయా విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన వారు ఇందుకు అర్హులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్న్​షిప్​నకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు 'ఇస్రో ఇంటర్న్‌షిప్ స్కీం'కు అర్హులు. ఆరు నెలల క్రితమే ఈ కోర్సుల్లో పాసైన వారు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఆయా కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.32/10 సీజీపీఏ గ్రేడ్ పొందిన వారు మాత్రమే అప్లై చేయాలి. దీనికి ఎంపికయ్యే వారికి గరిష్ఠంగా 45 రోజుల పాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ వ్యవధిలో ఎలాంటి స్టైపెండ్​ ఉండదు.

అర్హతలు
బీఈ/బీ.టెక్‌లో ఆరు సెమిస్టర్లు పాసైన విద్యార్థులు, ఎంఈ/ఎం.టెక్‌ మొదటి సెమిస్టర్‌లో పాసైన వారు ఇస్రో స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీంకు దరఖాస్తు చేయొచ్చు. బీఎస్‌సీ/డిప్లొమా కోర్సు చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు కూడా దీనికి అర్హులే. ఎంఎస్‌సీ‌లో మొదటి సెమిస్టర్ పూర్తి చేసినవారు, పీహెచ్‌డీలో కోర్స్ వర్క్‌ను పూర్తి చేసిన వారికి కూడా అర్హత ఉంది. దీనికి ఎంపికయ్యే బీఎస్‌సీ/డిప్లొమా విద్యార్థులకు కనీసం 45 రోజుల పాటు ఇంటర్న్‌షిప్ లభిస్తుంది. ఎంఈ/ఎంటెక్, ఎంఎస్‌సీ విద్యార్థులకు 120 రోజుల ఇంటర్న్‌షిప్, పీహెచ్‌డీ విద్యార్థులకు 30 నెలల ఇంటర్న్‌షిప్ లభిస్తుంది.

ప్రాజెక్ట్ వర్క్‌లు ఇలా
ఈ ఇంటర్న్‌షిప్ స్కీంలకు దరఖాస్తులను సమర్పించే విద్యార్థులకు ఉన్న పరిజ్ఞానం, అనుభవం, అవగాహన ఆధారంగా వారికి ప్రాజెక్ట్ వర్క్‌లను కేటాయిస్తారు. వాటితో ముడిపడిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తారు. ఇస్రోకు సంబంధించిన యూనిట్‌లో నిపుణుల పర్యవేక్షణలో విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసి, ప్రాజెక్ట్ వర్క్‌లను సమగ్రంగా సమర్పించిన వారికి సర్టిఫికెట్లను ఇస్తారు. విద్యార్థులు సమర్పించే ప్రాజెక్ట్ వర్క్‌లను ఆయా విభాగాల అధిపతులు మూల్యాంకనం చేస్తారు.

దరఖాస్తు
ఈ ఇంటర్న్‌షిప్‌ల కోసంisro.gov.in అనే ఇస్రో అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. ఇంటర్న్‌షిప్ అందుబాటులో ఉన్న ఇస్రో అనుబంధ పరిశోధనా కేంద్రాల జాబితాను ఈ వెబ్‌సైట్‌లో మనం చూడొచ్చు.

ABOUT THE AUTHOR

...view details