Preparation Tips For Exams : తెల్లవారుజామునే లేచి పుస్తకాలను చక్కగా చదువుకోవాలనుకుంటారు కొంతమంది విద్యార్థులు. దీనికి ముందు జాగ్రత్తగా అలారం కూడా పెట్టుకుంటారు. కానీ చలికి తట్టుకోలేక నిద్రలేచే ఓపిక లేకుంటే, దాన్ని ఆపేసి మళ్లీ ముసుగేసి పడుకుంటారు. పుస్తకాలను చదివి నేర్చుకోవలసిన వాటిని వాయిదా వేసేస్తుంటారు. ఈ పరిస్థితి మిమ్మల్ని కూడా వెంటాడుతుందా? అయితే ఈ కింది విధానాలను పాటించి చూడండి కాస్త మెరుగ్గా చదవుతారు.
- వాయిదాలు వద్దు : కొంచెం కష్టంగా ఉండే సబ్జెక్టులను వెంటనే చదవకుండా తరువాత చూద్దాం అని వాయిదా వేస్తుంటారు కొందరు. తీరా పరీక్ష గడువు తేదీ దగ్గరకు వచ్చాక ఇబ్బందులు పడుతుంటారు. అలాకాకుండా కాస్త కఠినంగా ఉండే సబ్జెక్టును 15 నిమిషాల పాటు సమయం పెట్టుకుని చదవాలి. ఆ తర్వాత కూడా దాన్నే చదవాలనే ఆసక్తి ఉంటే కొనసాగించొచ్చు. లేదంటే మరో సబ్జెక్టును మొదలుపెట్టొచ్చు. ఇలా చేస్తే వాయిదా వేసే పద్దతి మీ దగ్గరకు రాదు. ఆసక్తిగా ఉన్న సబ్జెక్టును వెంటనే చదవడం మొదలు పెడతారు.
- ఒకే సబ్జెక్టుతో తీవ్ర నష్టం : కొంతమంది రోజంతా ఒకే సబ్జెక్టు పట్టుకుని చదువుతూ ఉంటారు. దీనివల్ల చాలావరకూ ఆసక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రతి సబ్జెక్టును చదవడానికి ఓ నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. అందుకోసం ముందస్తుగా టైమ్‌టేబుల్ వేసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. అలాగే దాన్ని కచ్చితంగా అమలు పరచడం కోసం ప్రయత్నించాలి. సబ్జెక్టుల మధ్యలో కాస్త విరామ సమయం ఉండేలా ప్లాన్ వేసుకోవాలి. ఆ సమయంలో వాకింగ్ చేస్తే చురుగ్గా ఉండగలుగుతారు. ఆ తర్వాత మరో సబ్జెక్టును చదవడం ప్రారంభించాలి. ఇలా ఒక్కో సబ్జెక్టుకూ తగిన సమయాన్ని కేటాయించడం వల్ల ఏకాగ్రత కోల్పోకుండా సిలబస్‌ను పూర్తి చేయవచ్చు.
- కొత్త పద్ధతిలో నేర్చుకోవాలి :ఇప్పటికీ పాత పద్ధతుల్లో నేర్చుకోవడమే చాలామందికి అలవాటుగా ఉంటుంది. అలాకాకుండా నిత్యం కొత్తగా నేర్చుకుని, అందరి కంటే పరీక్షల పోటీలో ముందుండేందుకు ప్రయత్నించాలి. పుస్తకంలో చదివే పాఠానికి సంబంధించిన ఆడియో వినొచ్చు. లేదంటే అందుబాటులో ఉంటే యూట్యూబ్‌లో వీడియోనూ కూడా చూడొచ్చు. పాత క్వశ్చన్ పేపర్లను ప్రాక్టిస్ చేయొచ్చు. మీరు చదివిన అంశానికి సంబంధించిన ముఖ్యాంశాల మీద స్నేహితులను పలు ప్రశ్నలు వేయమనీ అడగొచ్చు. అలాగే మీరు కూడా కొన్ని ప్రశ్నలను సంధించవచ్చు. ఇలా నేర్చుకునే విషయాలు చాలా మందికి దీర్ఘకాలం గుర్తుంటాయి. అలాగే ఫ్లాష్ కార్డులను తయారుచేసుకుని కూడా వినియోగించుకోవచ్చు.
- వేగాన్ని పెంచుకోవాలి : నేర్చుకునే వేగాన్ని పెంచే క్రమంలో మిమ్మల్ని మీరే సవాలు తీసుకోవాలి. ఉదాహరణకు మీరు గంటలో ఆరు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించగలరు అనుకుంటే, ఆ తర్వాత నుంచీ వాటి సంఖ్యను పెంచుకుంటూ సామర్థ్యాన్ని సుస్థిర పరచుకోవాలి. గతంలో జరిగిన పరీక్షలో మీకు 60 శాతం మార్కులు వచ్చాయనుకుంటే. రాబోయే పరీక్షల్లో కచ్చితంగా 90 శాతం మార్కులు సాధించాలనే లక్ష్యాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇలా మీకు మీరే సవాలు విసురుకుని పోటీగా నిలిచి విజయతీరాలకు చేరొచ్చు.
- మార్గనిర్దేశం చేసేవారు ఉంటే : నేర్చుకునే క్రమంలో విద్యార్థులకు ఎన్నో సందేహాలు, అనుమానాలు వస్తుంటాయి. ఎలాంటి పద్ధతులను అనుసరించి చదవాలి? ఎలా చదివితే పరీక్షల్లో మంచి మార్కులు సాధించొచ్చు? ఏ సబ్జెక్టులలో సులభంగా ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది?. ఇలాంటి విషయాల్లో ఎవరైనా మెలుకువలు చేప్తే బాగుంటుందని అనిపిస్తుంది కూడా. అందుకోసం సీనియర్లు లేదా తోటి విద్యార్థుల్లో మంచిగా చదివేవారి సలహాలు, సూచనలు తీసుకుంటే ప్రిపరేషన్‌కు ఉపయోగకరంగా ఉంటుంది.
- బ్రేక్ అవసరమే : ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే క్రమంలో ప్రతి ఒక్కరూ అలసిపోతుంటారు. అందుకే మధ్య మధ్యలో చిన్న విరామం తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల సమయం వృథా అవుతుందని అస్సలు అనుకోకూడదు. ఆ సమయంలో మెదడు చురుకుదనాన్ని పెంచే సుడోకు, వర్డ్ పజిల్స్ లాంటి వాటిని ప్రయత్నించొచ్చు. దీంతో పునరుత్తేజం పొంది మొక్కుబడిగా కాకుండా ఆసక్తిగా పస్తకాలలోని కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారు.