Telangana Inter Exams 2025 :వార్షిక పరీక్షల షెడ్యూల్ రాగానే ప్రతి ఒక్క విద్యార్థిలో అలజడి మొదలవుతుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం విషాదకర ఘటనలు జరుగుతున్నాయి. ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సన్నద్ధం అయితే ఒత్తిడి దరిచేరదని, ఎక్కువ మార్కులు వస్తాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచనలు చేస్తున్నారు. పరీక్షలు బాగా రాయలేమని, ఫెయిల్ అవుతామని, కెరీర్ ఏమి అవుతుందోననే భయం వీడాలని వారు అంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో సతమతం అవుతున్న విద్యార్థులకు టెలిమానస్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు టోల్‌ఫ్రీ 14416 అందుబాటులోకి తెచ్చింది.
90 రోజుల ప్రణాళిక : -
- ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.
- వచ్చే నెల 3 నుంచి 22 వరకు ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి.
- మార్చి 5 నుంచి 25 వరకు వార్షిక పరీక్షలు జరుగనున్నాయి.
- నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పటికే 90 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఆ ప్రణాళిక అమలు చేస్తున్నారు.
- మొదటగా వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.