US Study Guide :మన దేశం నుంచి నిత్యం ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తుంటారు. అక్కడికి వెళ్లి చదువుకుంటే అయ్యే ఖర్చులపై విద్యార్థులకు ముందుగానే మంచి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఆయా యూనివర్సిటీలు ముందే తమ ఫీజు వివరాలను స్పష్టంగా ప్రకటిస్తాయి. కానీ అమెరికాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన జీవన వ్యయాలపై విద్యార్థులకు ముందస్తు క్లారిటీ లభించదు. ఒకవేళ కొంత ఫీడ్ బ్యాక్‌ను సేకరించినా, అది అంత కచ్చితత్వంతో ఉండకపోవచ్చు. అందుకే అమెరికాలోని ఏయే ప్రాంతాల్లో జీవన వ్యయాలు ఎలా ఉంటాయనే వివరాలను ఈ ఆర్టికల్‌లో ఇచ్చాం.
భిన్నంగా జీవన వ్యయాలు
అమెరికాలోని ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, మిడ్ వెస్ట్ అండ్ ఉత్తర మైదానాలు, సౌత్ అండ్ మౌంటెయిన్ స్టేట్స్లో జీవన వ్యయాలు భిన్నంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల ద్రవ్యోల్బణం, మార్కెట్ స్థితిగతులు భిన్నంగా ఉంటాయి. ఇంటి అద్దెలు కాకుండా, ఒక వ్యక్తి సగటు నెలవారీ ఖర్చులే దాదాపు రూ.1లక్ష దాకా ఉంటాయని ఒక అంచనా. వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదికలో ఈ వివరాలను ప్రస్తావించారు.
2024లో అమెరికాలోని ఏయే ప్రాంతాల్లో జీవన వ్యయాలు ఎలా ఉన్నాయనే వివరాలను కింద చూడొచ్చు.
1. ఈస్ట్ కోస్ట్ ప్రాంతం
- న్యూ ఇంగ్లాండ్ ఏరియా : బోస్టన్, ప్రొవిడెన్స్, హార్ట్ఫోర్డ్ నగరాలు
- మధ్య అట్లాంటిక్ ఏరియా : న్యూయార్క్, ఫిలడెల్ఫియా, బాల్టిమోర్, వాషింగ్టన్ డీసీ నగరాలు
- ఆగ్నేయ ఏరియా : మయామి, అట్లాంటా, షార్లెట్, ఓర్లాండో నగరాలు
అద్దె ఖర్చులు : న్యూయార్క్ నగరంలో అపార్ట్మెంట్ అద్దెకు నెలకు రూ.2.85 లక్షలు. బోస్టన్‌లో నెల అద్దె సగటున రూ.2.43 లక్షలు. బాల్టిమోర్, ప్రొవిడెన్స్ వంటి ప్రదేశాలలో సగటు నెలవారీ అద్దెలు రూ.1.25 లక్షల నుంచి రూ.1.42 లక్షల మధ్య ఉంటాయి.
రవాణా ఖర్చులు : న్యూయార్క్ నగరంలో రవాణా ఖర్చులు, నెలవారీ సబ్వే పాస్ ఖర్చులు దాదాపు రూ.10వేలకుపైనే ఉంటాయి. కానీ ప్రొవిడెన్స్ వంటి చిన్న నగరాల్లో ఈ ఖర్చు రూ.6వేలలోపే ఉంటుంది.
ఆహారం, కిరాణా సరుకుల ధరలు:అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలోని నగరాల్లో కిరాణా సామాన్లు బాగా రేట్లు ఎక్కువ. ఇక్కడ హోటళ్లలో ఫుడ్స్ కూడా చాలా కాస్ట్లీ. ఉదాహరణకు న్యూయార్క్ నగరంలోని మధ్య శ్రేణి రెస్టారెంట్లో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తే దాదాపు రూ.6,200 ఖర్చవుతుంది.
యుటిలిటీ, ఇంటర్నెట్ బిల్స్ :బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో యుటిలిటీ బిల్లుల ఖర్చులు సాధారణంగా నెలకు రూ.12,500 నుంచి రూ.17,000 వరకు ఉంటాయి. ఇంటర్నెట్ బిల్స్ ప్రతినెలా రూ.5వేల నుంచి రూ.5,800 వరకు వస్తాయి.
2. వెస్ట్ కోస్ట్ ప్రాంతం
- పసిఫిక్ నార్త్‌వెస్ట్ ఏరియా : సియాటెల్, పోర్ట్‌ల్యాండ్ నగరాలు
- కాలిఫోర్నియా ఏరియా : లాస్ ఏంజిల్స్, శాన్ఫ్రాన్సిస్కో, శాన్ డియాగో, శాక్రమెంటో నగరాలు
అద్దె ఖర్చులు: శాన్ఫ్రాన్సిస్కో ఏరియాలో అద్దెలు చాలా ఎక్కువ. ఇక్కడ సగటు నెలవారీ అద్దె దాదాపు రూ.3.18 లక్షలు ఉంటుంది. లాస్ ఏంజిల్స్‌లో సగటు నెలవారీ అద్దె దాదాపు రూ.2.94 లక్షలు ఉంటుంది. పసిఫిక్ నార్త్‌వెస్ట్ ఏరియాలో, సియాటెల్ ఏరియాలో నెలవారీ సగటు అద్దె దాదాపు రూ.2.43 లక్షలు ఉంటుంది. పోర్ట్‌ల్యాండ్ ఏరియాలో నెలవారీ అద్దెలు దాదాపు రూ.1.93 లక్షల మేర ఉంటాయి.
రవాణా ఖర్చులు:లాస్ ఏంజిల్స్, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో రవాణా ఖర్చులు, నెలవారీ పాస్ ధర దాదాపు రూ.8,300 రేంజ్లో ఉంటాయి. ప్రపంచ జనాభా సమీక్ష నివేదికలో ఈ వివరాలను ప్రస్తావించారు.
ఆహారం, కిరాణా సరుకుల ధరలు: కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్ వంటి నగరాల్లో ఆహారం, కిరాణా సరుకుల ధరలు చాలా ఎక్కువ. అమెరికాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ కిరాణా సామాగ్రిపై దాదాపు 10 నుంచి 15 శాతం ఎక్కువ రేట్లను చెల్లించాల్సి వస్తుంటుంది.
యుటిలిటీ, ఇంటర్నెట్ బిల్స్ : శాన్ఫ్రాన్సిస్కో, సియాటెల్ వంటి నగరాల్లో విద్యుత్ బిల్లులు, హీటింగ్ బిల్లులు, నీటి బిల్లులు సగటున ప్రతినెలా రూ.12 వేల నుంచి రూ.17వేల వరకు ఉంటాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రాథమిక స్థాయి ప్యాకేజీ కోసం ప్రతి నెలా రూ.6వేల దాకా పే చేయాల్సి ఉంటుంది.