Engineering Counselling : ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు ముందుగానే విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పరిస్థితుల గురించి ప్రాథమిక సమాచారం సేకరించుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉన్నతస్థాయిలో రాణించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
గుర్తుంచుకోవాల్సిన అంశాలివీ..
- విద్యార్థులకు కళాశాల ఎంపిక, బ్రాంచిపై అవగాహన తప్పనిసరి. చాలావరకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), సీఎస్‌ఈకి ప్రాధాన్యం ఇస్తుండగా ఆ తర్వాత ఐటీ, ఈసీఈ, ట్రిపుల్‌ఈ ఎంచుకుంటున్నారు.
- కంప్యూటర్ సైన్స్ విషయంలో ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీస్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- విద్యార్థులు తమకు ఏ రంగంపై ఆసక్తి ఉందో గమనించుకోవాలి. ఆ రంగానికి సంబంధించి భవిష్యత్ ఉన్న బ్రాంచిపైనే దృష్టి సారించాలి. ఎవరో చెప్పారని, తోటి స్నేహితులు చేరారనో కళాశాలలు, బ్రాంచిలను ఎంచుకోవటం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆసక్తి లేకుండా ఆయా కోర్సుల్లో చేరితే వాటిని సకాలంలో పూర్తి చేయలేకపోవటమే కాకుండా సమయం వృథా అయ్యే ప్రమాదం ఉంది.
- కోర్సుల ఎంపికతో పాటు కళాశాలలో సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. కళాశాలలకు గుర్తింపు ఇచ్చే న్యాక్, అటానమస్, ఎన్‌బీఏ తదితర సర్టిఫికెట్లు ఉన్నాయో లేదో తల్లిదండ్రులు పరిశీలించాలి.
- ఫ్యాకల్టీ అర్హత, ఉత్తీర్ణత శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
- ఏ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసినా సాఫ్ట్‌వేర్ రంగంలో కొలువులకు అవకాశం ఉంటుంది. వాటికి కావాల్సిన నైపుణ్య(స్కిల్) శిక్షణను తొలి ఏడాది నుంచి ఇచ్చే కళాశాలను గుర్తించాలి.
- కేవలం పుస్తకాలకే పరిమితమయ్యే కళాశాలలు కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యమిచ్చే వాటిని ఎంపిక చేసుకోవాలి.
- నైతిక విలువలు, క్రమశిక్షణకు పెద్దపీట వేసే కళాశాలలను పరిశీలించుకోవటం మంచిది.
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇది..
- ధ్రువపత్రాల పరిశీలన: ఈ నెల 10వ తేదీతో పూర్తయ్యింది.
- వెబ్ ఆప్షన్ల నమోదు : 8 నుంచి 12 వరకు
- ఆప్షన్ల మార్పు : 13న
- సీట్ల కేటాయింపు : 16న
- కళాశాలల్లో రిపోర్టింగ్: 17 నుంచి 22 వరకు
- తరగతుల ప్రారంభం: 19 నుంచి
ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు - ఆ కాలేజీల్లో ఎంతంటే? - ENGINEERING FEES in ap