Navy Agniveer Recruitment 2024 : ఇండియన్ నేవీ అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్ (ఎస్‌ఎస్‌ఆర్) నోటిఫికేషన్లను విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హతలతో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు రకాల పోస్టులకు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులకు ముందుగా రెండు దశల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. తరువాత ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి, అర్హులైన వారిని అగ్నివీర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారు శిక్షణతో కలిపి నాలుగేళ్లు అగ్నివీరులుగా సేవలు అందించాల్సి ఉంటుంది. ఇవి శాశ్వత ఉద్యోగాలు కాదు. అయినప్పటికీ అగ్నివీర్‌గా ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రం శాశ్వత ఉద్యోగ అవకాశం దక్కుతుంది. అంటే ఎంపికైన మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌ఆర్, ఎంఆర్ పోస్టుల్లో దేనికి ఎంపికైనప్పటికీ నాలుగేళ్లు సేవలు అందించినందుకుగాను అగ్నివీరులకు సేవానిధి ప్యాకేజీ అందిస్తారు.
ఏటా రెండు సార్లు
ఇండియన్ నేవీ ఏటా రెండుసార్లు అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్, ఎంఆర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. అర్హత కలిగినవాళ్లు రెండు పరీక్షలకు కూడా విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు
- మొదటి సంవత్సరం : నెలకు రూ.30,000
- రెండో సంవత్సరం : నెలకు రూ.33,000
- మూడో సంవత్సరం : నెలకు రూ.36,500
- నాలుగో సంవత్సరం : నెలకు రూ.40,000
పదో తరగతి, ఇంటర్ విద్యార్హతలతో పోస్టులు భర్తీ చేస్తున్నప్పటికీ, ఈ రెండింటిలో ఏ పోస్టుకు ఎంపికైనప్పటికీ జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు అన్నీ సమానంగానే ఉంటాయి. ట్రైనింగ్ సమయంలో సంవత్సరానికి 30 రోజులపాటు సెలవులు ఇస్తారు. ఆరోగ్య సమస్యలు వస్తే సిక్ లీవ్స్ కూడా ఇస్తారు.
4 ఏళ్ల సర్వీస్‌లో ఉన్నప్పుడు అగ్నివీరులకు రిస్క్ అండ్ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్ అలవెన్సులు కూడా అందిస్తారు. నాలుగేళ్లపాటు రూ.48 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పిస్తారు. చివరిలో అగ్నివీర్ 'స్కిల్ సర్టిఫికెట్' ప్రదానం చేస్తారు.
నాలుగేళ్ల తరువాత పరిస్థితి ఏమిటి?
నావీ నుంచి వైదొలిగిన అగ్నివీరులకు కార్పొరేట్ సంస్థల్లో, సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగాలు, విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలు సంస్థలు జాబ్ సెలక్షన్స్‌లో అగ్నివీరులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించాయి. ఒకవేళ వీరు కనుక సెల్ఫ్ ఎంప్లాయిమెంట్/ఆంత్రప్రెన్యూర్‌షిప్ దిశగా అడుగులు వేయాలని అనుకుంటే, బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా చూస్తారు.
సేవానిధి
అగ్నివీరులు ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతాన్ని కార్పస్ ఫండ్‌కు జమ చేస్తారు. అంటే మొదటి ఏడాది ప్రతి నెల పొందే రూ.30,000 జీతంలోంచి రూ.9000 మినహాయిస్తారు. అంటే అగ్నివీరుని చేతికి రూ.21,000 మాత్రమే అందుతుంది. రెండో ఏడాది రూ.23,100 వేతనం అందుతుంది. రూ.9900 ఆర్థిక నిధిలో జమ అవుతుంది. మూడో ఏడాది రూ.25,550 చేతికి వస్తుంది. రూ.10,950 కార్పస్ ఫండ్‌కు వెళ్తుంది. నాలుగో ఏట అగ్నివీరునికి రూ.28,000, నిధికి రూ.12,000 వెళ్తాయి. మొత్తంగా నాలుగేళ్ల వ్యవధిలో అగ్నివీరుని నుంచి సేవానిధిలోకి రూ.5.02 లక్షలు జమ అవుతుంది. అంతే మొత్తాన్ని గవర్నమెంట్ కూడా జమ చేస్తుంది. అంటే రూ.10.04 లక్షల కార్పస్ ఏర్పడుతుంది. దీనికి వడ్డీని జతచేసి అగ్నివీరునికి అందిస్తారు. అంటే అగ్నివీరునికి సుమారుగా రూ.11.71 లక్షలు చేతికి అందుతాయి. ఈ డబ్బుపై పన్ను కూడా ఉండదు.
మధ్యలో మానేస్తే?
అగ్నివీరులు కావాలనుకుంటే 4 ఏళ్లలోపే విధుల నుంచి వైదొలగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అగ్నివీరుని వేతనం నుంచి జమ అయిన మొత్తాన్ని మాత్రమే చేతికి అందిస్తారు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆర్థిక ప్రోత్సాహం మాత్రం దక్కదు.
ఈ ప్రయోజనాలు ఉండవు!
అగ్నివీరులకు పెన్షన్, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్ పే (ఎంఎస్‌పీ), ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) లాంటివి రావు. ఎక్స్-సర్వీస్‌మెన్‌గా కూడా పరిగణించరు.