Most Asked Interview Questions :ఉద్యోగం సాధించే ప్రయత్నంలో ఉద్యోగార్థులంతా తప్పకుండా అధిగమించాల్సిన చివరిమెట్టు ఇంటర్వ్యూ! అంతకంటే ముందు ఎన్ని పరీక్షలు, గ్రూప్ డిస్కషన్లను విజయవంతంగా పూర్తిచేసినా, ఇంటర్వ్యూలో నెగ్గకుంటే వ్యవహారమంతా మొదటికొస్తుంది. సాధారణంగా ఇంటర్వ్యూలలో కొన్ని ప్రశ్నలు కామన్‌గా ఉంటాయి. రంగం ఏదైనా సరే, ప్రశ్నలు మాత్రమే అవే ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. అలాంటి ప్రశ్నలేంటి? పని అనుభవం, దానితో ముడిపడిన నైపుణ్యాల సమాచారాన్ని రంగరించి వాటికి ఆన్సర్స్ ఎలా చెప్పాలి? అనే టిప్స్ తెలుసుకుందాం.
- మీ గురించి చెప్పండి ?
సాధ్యమైనంత సంక్షిప్తంగా మీ గురించి మీరు వివరించండి. మీ పని అనుభవాలు, ఉద్యోగ నైపుణ్యాలు ఆ ఉద్యోగానికి ఎలా మ్యాచ్ అవుతాయో చెప్పండి. ఆ జాబ్‌కు మీరు ఎంతగా సూట్ అవుతారు అనేది తెలియజేయండి. - మీకు ఈ ఉద్యోగం ఎందుకు కావాలి ?
ఆ ఉద్యోగంపై మీకు ఆసక్తి ఎందుకు ఉందో చెప్పండి. ఆ పని చేయడానికి మీరు ఉత్సాహంగా ఉన్నారనేది తెలియజేయండి. కంపెనీలో మీరు పోషించబోయే పాత్రపై ఉన్న అవగాహనను తెలియజేసేలా పదాలు వాడండి. ఆ జాబ్‌లో చేరితే, మీరు ఏమేం చేస్తారనేది తెలియజేయండి. మీ కెరీర్ గోల్స్ ఏమిటో వివరించండి. - మేం మిమ్మల్ని ఎందుకు జాబ్‌లోకి తీసుకోవాలి ?
మీరు జాయిన్ అయితే కంపెనీకి కలిగే లాభాలను చెప్పండి. మీరు ఆ జాబ్ రోల్‌లో ఇతరుల కంటే భిన్నంగా ఎలా సేవలు అందించగలరో తెలియజేయండి. మీరే బెస్ట్ క్యాండిడేట్ అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి భావించేలా మీ ప్రజెంటేషన్ ఉండాలి. కంపెనీకి బలం చేకూర్చగలిగే మీ ఉద్యోగ సామర్థ్యాలు, నైపుణ్యాల గురించి వివరించండి. - మీ బలాలు, బలహీనతలు ఏమిటి ?
మీ గురించి మీకు ఎంత అవగాహన ఉంది ? స్వీయ విశ్లేషణను మీరు చేసుకుంటున్నారా? అనేది తెలుసుకునేందుకు ఈ ప్రశ్న అడుగుతుంటారు. మీరు ఆచితూచి సమాధానం చెప్పండి. ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి. మీ బలాలను కొన్ని ఉదాహరణలు, గత ఉద్యోగ అనుభవాలు, సాంకేతిక నైపుణ్యాలతో కలిపి వివరించండి. మీ బలహీనతల గురించి చెప్పేటప్పుడు వాటిని అధిగమించేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాల గురించి తప్పక తెలియజేయండి. - వచ్చే ఐదేళ్లలో మిమ్మల్ని ఏ స్థాయిలో చూసుకోవాలని అనుకుంటున్నారు?
మీ కెరీర్ లక్ష్యాలు, ఉద్దేశాలను తెలుసుకునేందుకు ఈ ప్రశ్న అడుగుతారు. వాటిని మీరు చక్కగా ఇంటర్వ్యూయర్‌కు వివరించాలి. కంపెనీ పురోగతికి దోహదపడే విధంగా మీ లక్ష్యాలు ఉంటాయని చెప్పాలి. ఈ ఉద్యోగ అవకాశం అనేది మీ భవిష్యత్తు లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పునాదిరాయిగా నిలుస్తుందని వివరించాలి. - మీరు సవాళ్లను ఎదుర్కొన్న ఒక సందర్భాన్ని, దాన్ని అధిగమించిన తీరును వివరించండి?
మీరు సమస్యలను ఎలా ఎదుర్కొంటారు ? వాటిని ఎలా పరిష్కరిస్తారు ? అనేది తెలుసుకునేందుకు ఈ ప్రశ్నను అడుగుతారు. జీవితంలో లేదా గత ఉద్యోగంలో మీకు ఎదురైన క్లిష్టతరమైన సవాల్ గురించి, దానికి మీరు పరిష్కారాన్ని కనుగొన్న తీరును వివరించాలి. ఆ సమస్య సమసిపోయేందుకు మీరు అనుసరించిన మార్గం గురించి తెలియజేయాలి. - మీరు టీమ్‌లో కీలక సభ్యుడిగా పనిచేసిన ఒక సందర్భం గురించి వివరించండి?
మీరు టీమ్ వర్క్ చేయగలరా? ఇతరులతో కలిసి మెలిసి ముందుకు సాగగలరా? అనేది తెలుసుకునేందుకు ఈ ప్రశ్న అడుగుతారు. మీరు గతంలో సాధారణ టీమ్ సభ్యుడిగా పనిచేసిన సందర్భం గురించి టీమ్‌తో కలిసి సాధించిన ఒక అఛీవ్‌మెంట్ గురించి వివరించండి. టీమ్‌లో సభ్యుడిగా మీరు ఎలా పనిచేస్తారు? కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారు? టీమ్ సభ్యుడిగా సమస్య లేదా సవాల్ ఎదురైతే ఎలా పరిష్కారాన్ని కనుగొంటారు? అనేది తెలియజేయాలి. - మీ ప్రస్తుత ఉద్యోగాన్ని ఎందుకు వదిలేస్తున్నారు?
మీరు ఉద్యోగం ఎందుకు మారుతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా, ఉన్నది ఉన్నట్టుగా వివరించండి. ఈ సమయంలో పాజిటివ్ బాడీ ల్యాంగ్వేజీతో కనిపించండి. కొత్త ఉద్యోగ అవకాశం మీకు ఎంత ముఖ్యమో విడమర్చి చెప్పండి. కెరీర్ గ్రోత్ కోసం, కొత్త సవాళ్లను స్వీకరించేందుకు, మీ పని నైపుణ్యాలకు మెరుగుపర్చుకునేందుకు కొత్త ఉద్యోగంలోకి వస్తున్నారనే విషయాన్ని ఇంటర్వ్యూయర్‌కు చెప్పొచ్చు. - మీరు ఎంత శాలరీని ఆశిస్తున్నారు?
మీ విలువను అంచనా వేయడానికి ఈ ప్రశ్నను ఇంటర్వ్యూయర్ అడుగుతారు. మీరు ఆశిస్తున్న శాలరీ ఎంతో చెప్పాలి. అయితే ఈవిషయంలో కొంత ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. మీరు పోషించబోయే ఉద్యోగ పాత్ర ప్రాధాన్యం, అనుభవం స్థాయి, మీ నైపుణ్యాలను చెబుతూ శాలరీని డిమాండ్ చేయొచ్చు. మీరు సగటున ఎంత రేంజులో శాలరీని కోరుకుంటున్నారు అనేది ఇంటర్వ్యూయర్‌కు క్లియర్‌గా చెప్పేయాలి. - మీరు మమ్మల్ని ఏమైనా అడగాలని అనుకుంటున్నారా?
కంపెనీపై, కొత్త ఉద్యోగంపై మీకున్న ఆసక్తి గురించి తెలుసుకునేందుకు ఇంటర్వ్యూయర్ ఈ ప్రశ్నను అడుగుతారు. కంపెనీ కల్చర్, టీమ్, ఉద్యోగ పాత్ర, భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మీరు ఇంటర్వ్యూయర్‌ను ప్రశ్నలు అడగొచ్చు. మీలోని చొరవను ఇంటర్వ్యూయర్ గ్రహించేలా ఈ ప్రశ్నలు ఉండాలని గుర్తుంచుకోవాలి.