తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఈ చదువు ఉద్యోగాల కోట - ఆకర్షణీయ వేతనం.. ఉజ్వల భవిష్యత్తు! - SEMICONDUCTOR INDUSTRY JOB DETAILS

- రానున్న సంవత్సరాల్లో భారత్​లో భారీగా అవకాశాలు - పాగా వేయాలంటే ఇలా చేయాలంటున్న నిపుణులు

Job opportunities in Semiconductor Industry
Job opportunities in Semiconductor Industry (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2024, 1:29 PM IST

Job opportunities in Semiconductor Industry:స్మార్ట్​ఫోన్, కంప్యూటర్, డిజిటల్‌ కెమెరా, వాషింగ్‌ మెషీన్‌.. ఇలా ఒకటేమిటి నేటి ఆధునిక కాలంలో మనం ఉపయోగించే ప్రతి ఎలక్ట్ట్రానిక్‌ సాధనంలోనూ ఉండే ఉపకరణం.. "సెమీ కండక్టర్‌". మానవదేహంలోని గుండెకాయతో దీన్ని పోల్చవచ్చు. ఎలక్ట్రానిక్‌ సాధనాన్ని ఎలక్ట్రిక్‌ వ్యవస్థతో అనుసంధానించే చిప్‌ తయారీలో ముడిసరుకు ఇది. రానున్న సంవత్సరాల్లో ఈ రంగం మహోజ్వలంగా వెలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. మరి ఇందుకు ఉన్న అవకాశాలు ఏంటి? ఉద్యోగాల కంచుకోటగా ఎదగనున్న సెమీ కండక్టర్‌ పరిశ్రమలో పాగా ఎలా వేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా భారత్‌లో ప్రతి సంవత్సరం ఇంజినీరింగ్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజీల నుంచి చదువుకొని పట్టభద్రులవుతున్నవారు అత్యధికం. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇజ్రాయిల్‌ వంటి దేశాలకంటే ఇండియా ఈ విషయంలో ముందుంది. ప్రతి సంవత్సరం సుమారు 25 లక్షలమంది ఇంజినీరింగ్, సైన్స్‌ విద్యార్థులు గ్రాడ్యుయేట్లు అవుతున్నారు. అయితే మానవ వనరులే ప్రధాన పెట్టుబడిగా నిర్వహించే సెమీ కండక్టర్‌కి ఇది కలిసొచ్చే విషయం. ఇంత మొత్తంలో గ్రాడ్యుయేట్లు లభిస్తున్నందున డిమాండ్‌- సప్లై అంశం ఆధారంగా మానవ వనరులపై పెట్టుబడి తగ్గుతుంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయంపై ఒత్తిడి తగ్గుతుంది. దానితో సెమీ కండక్టర్‌ మార్కెట్‌లో సరసమైన ధరలతో ఇండియా ఉత్పత్తులు ఇప్పటికే పాతుకుపోయిన కంపెనీలకు గట్టి పోటీ ఇస్తాయి.

ఇక ఈ పరిశ్రమకు కావలసిన ప్రాథమిక సౌకర్యాలు మనదేశానికి ఉండటం మరొక పటిష్ఠమైన అంశం. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతోపాటు యూరప్, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు ఇండియా సమీపంగా ఉండటం వల్ల రవాణాలో చాలా వరకు వ్యయం కంట్రోల్​లో ఉంటుంది. ఈ కారణం చేతనే సెమీ కండక్టర్ల ఉత్పత్తి కేంద్రాలను భారత్‌లోనే నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిశ్రమ పరిగెత్తాలంటే కేవలం పెట్టుబడి మాత్రమే ఉంటే సరిపోదు. విద్యాధికుల లభ్యత, నైపుణ్యం గల యువత అందుబాటు, పరిశోధన, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ రాయితీలు అవసరం. ప్రస్తుతం భారత్‌లో వీటన్నింటితో బలమైన ఉత్పత్తి వ్యవస్థ సిద్ధంగా ఉండటం ఈ పరిశ్రమకు అనుకూలాంశం.

సెమీ కండక్టర్‌ పరిశ్రమలో పాగా వేయడం ఎలా:

కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్‌ మిషన్‌ (ఐ.ఎస్‌.ఎం.) రెండో దశను త్వరలో ప్రకటించనుంది. తయారీలోని వివిధ విభాగాలు, ముడి సరుకు లభ్యత పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. దీంతో కొత్త సెమీ కండక్టర్‌ కంపెనీలు అడుగుపెడుతున్నాయి. ఫలితంగా 2026 నాటికి ఈ పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాల అంచనా వాస్తవరూపం దాల్చవచ్చు. ఈ పరిశ్రమలో అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కెటింగ్, ప్యాకేజింగ్, చిప్‌ డిజైన్, సాఫ్ట్‌వేర్‌ డెవపల్‌మెంట్, సిస్టమ్‌ సర్యూట్లు, మాన్యుఫ్యాక్చరింగ్, సప్లయి చెయిన్‌ విభాగాల్లో ఉద్యోగాలు వెల్లువగా రానున్నాయి. మరి ఈ సెమీ కండక్టర్‌ రంగంలో ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలంటే..

ఆసక్తి: లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని గుడ్డిగా ఆ దారి పట్టకూడదని నిపుణులు అంటున్నారు. ముందుగా సెమీ కండక్టర్‌ తయారీ ప్రక్రియను తెలుసుకొని ఆ డొమైన్‌లో పనిచేయడం ఆసక్తికరంగా ఉంటుందో లేదో నిజాయతీగా అంచనా వేసుకోవాలని.. దాన్ని బట్టే నిర్ణయం తీసుకోవాలంటున్నారు.

విద్యార్హతల సాధన: ఈ రంగం సాంకేతిక విజ్ఞానం ఆధారంగా నిర్వహించేది. ప్రవేశించేందుకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సులు చేసి ఉండటం అవసరం. ఈ సెమీ కండక్టర్​ రంగంలో ఏ పొజిషన్‌ ఆశిస్తున్నారో దానికి తగ్గ కోర్సులతో సిద్ధంగా ఉండాలి.

అనుభవం: కేవలం అకడమిక్‌ క్వాలిఫికేషన్​ మాత్రమే ఈ రంగంలో పెద్ద ప్యాకేజీని తీసుకురాలేదు. క్యాంపస్‌ చదువులతోపాటు ప్రాజెక్టు వర్క్, ఇంటర్న్‌షిప్‌ వంటివి చేసి కొంత అనుభవం గడిస్తే పరిశ్రమలో ప్రవేశించేందుకు అంత శ్రమపడాల్సిన అవసరం ఉండదు. పైగా ఆకర్షణీయమైన ప్యాకేజీ లభిస్తుంది.

టెక్నాలజీపై అవగాహన: సెమీ కండక్టర్‌ అనేది నూతనంగా కళ్లు విప్పిన సంక్లిష్ట రంగం. ఇక్కడ ఇప్పటికే దారులు వేసి లేవు. కాబట్టి ఇప్పుడు ఈ రంగంలోకి ప్రవేశించేవారు తమ మార్గాన్ని తామే నిర్మించుకోవాలి. అందుకోసం వివిధ టెక్నాలజీలనూ, సాంకేతిక విజ్ఞాన ప్రక్రియలనూ వేగంగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పెంచుకోవాలి.

శాస్త్రీయ విజ్ఞానం: సెమీ కండక్టర్‌ తయారీలో చిప్‌ డిజైనింగ్‌ నుంచి సిలికాన్‌ ముడి సరకుగా చివరి ఉత్పత్తి వరకూ వివిధ దశలుంటాయి. అందువల్ల టెక్నాలజీ మాత్రమే కాక శాస్త్రీయ దృక్పథం అవసరం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్‌ సైన్స్‌పై కూడా అవగాహన ఉంటే ఢోకా ఉండదు.

ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు: చిప్‌ తయారీ నుంచి ప్రొడక్ట్‌ ఫినిష్డ్‌ వరకూ ప్రతి దశలోనూ ప్రోగ్రామ్స్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ అవసరం ఉంటుంది. అందువల్ల ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై కూడా పట్టు ఉండాలి. ముఖ్యమైన లాంగ్వేజెస్‌ నేర్చుకోవాలి.

మల్టీ టాస్కింగ్‌: కొత్త రంగంలోకి ప్రవేశించేటప్పుడు ఒకే ఒక టాస్క్‌ చేసి కూర్చోవడం కుదరదు. పెద్ద కంపెనీలయితే ఇది నప్పుతుందేమో కానీ మధ్య, చిన్న తరహా కంపెనీల్లో ప్రొడక్షన్​లో పాల్గొనేటప్పుడు ఒకటికి మించిన టాస్కులు చేయగలిగే సత్తా ఉండాలి. అప్పుడే చేరిన ఉద్యోగంలో మనుగడా, గుర్తింపు లభిస్తుంది.

వీటితోపాటు కార్పొరేట్‌ రంగంలో రాణించేందుకు అవసరమైన కమ్యూనికేషన్‌ స్కిల్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ సామర్థ్యం ముఖ్యం. వీలైతే సెమీ కండక్టర్‌ సంబంధిత సర్టిఫికెట్లు పొందాలి. స్పష్టమైన రెజ్యూమెతో సిద్ధంగా ఉంటే సెమీ కండక్టర్‌ రంగం విస్తృత అవకాశాలతో యువతను ఆహ్వానిస్తుందని అంటున్నారు.

ఈ కాలేజీలో సీటు దొరికితే ఉద్యోగం వచ్చినట్లే! - కోర్సు పూర్తయ్యే నాటికి చేతిలో కొలువు పక్కా!!

డిగ్రీ, బీటెక్‌ అర్హతతో ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు - చివరి తేదీ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details