ISRO Internship : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఇటీవల ఇంటర్న్‌షిప్, స్టూడెంట్ ప్రాజెక్టు ట్రైనీ స్కీమ్‌లను ప్రకటించింది. స్పేస్ సైన్స్ & టెక్నాలజీ రంగాలపై ఆసక్తి, ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. అర్హత కలిగిన భారతీయ విద్యార్థులు అందరూ వీటికి అప్లై చేసుకోవచ్చు. నిష్ణాతులైన శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు.
ఇంటర్న్‌షిప్‌నకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
భారతదేశంలో లేదా విదేశాలలో గుర్తింపు పొందిన సంస్థల నుంచి సైన్స్ & టెక్నాలజీలను ప్రధాన అంశాలుగా చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ విద్యార్థులు ఇస్రో ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే విద్యార్థులు కనీసం 60% ఓవరాల్ స్కోర్ లేదా 10కి 6.32 CGPA కలిగి ఉండాలి. అయితే మంచి విద్యార్హతలతోపాటు, నిబద్ధత ఉన్న విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఇంటర్న్‌షిప్ వ్యవధి గరిష్ఠంగా 45 రోజులు ఉంటుంది. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు అత్యాధునిక అంతరిక్ష పరిశోధనా అనుభవం కలుగుతుంది. పైగా ట్రైనింగ్ అయిన తరువాత వారికి సర్టిఫికెట్స్ కూడా అందిస్తారు.
స్టూడెంట్ ప్రాజెక్టు ట్రైనీ స్కీమ్
ఇస్రో ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం 'స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్'ను ప్రవేశపెట్టింది. 6వ సెమిస్టరు పూర్తిచేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు; 1వ సెమిస్టర్ పూర్తి చేసిన ఎంఈ, ఎంటెక్ విద్యార్థులు; ఫైనల్ ఇయర్ బీఎస్ఈ, డిప్లొమా విద్యార్థులు; 1వ సెమిస్టర్ పూర్తి చేసిన ఎంఎస్సీ విద్యార్థులు ఈ స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్‌కు అర్హులు. కోర్సు పూర్తి చేసిన పీహెచ్డీ స్కాలర్స్ కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే విద్యార్థులు కనీసం 60% మార్కులతో లేదా 10కి 6.32 CGPAని కలిగి ఉండాలి. నిబంధనల మేరకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.