Spoken English Tips in Telugu : ఉన్నత చదువులు చదివినా చాలా మంది ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయపడిపోతుంటారు. భాషపై అవగాహన ఉన్నా ఎదుటి వ్యక్తులు తప్పులు ఎత్తిచూపుతారేమోనని ఒకవైపు, సందర్భానుసారం పదాలు దొరక్క ఇంకో వైపు వెనకడుగేస్తారు. ఈ భయాలు పోవాలంటే సమాధానం ఒక్కటే.. అదే ఇంగ్లిష్ నేర్చుకోవడమే! ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొత్తగా నేర్చుకోవడం కాదులే అనుకుంటే ఇక ఎప్పటికీ నేర్చుకోలేరు. మీ ఇంట్లో రోజువారీ పనుల్లో భాగంగానే కొన్ని మెళకువలు పాటించి ఆడుతూ పాడుతూ మీ ఇంగ్లీష్ స్కిల్స్‌ను పెంచుకోవచ్చు. మరి, ఆ టిప్స్ చూద్దామా!
సినిమాలు చూడాలి : మీ చుట్టు పక్కల ఉన్నవారితో వీలైనంత మేర ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్‌లో మూవీలు చూడటం, పాటలు వినడం వంటివి చేయండి. ఇంగ్లీష్‌పై పట్టు పెంచుకొనేందుకు ఆంగ్ల పుస్తకాలు చదవడం ప్రారంభించండి. ఇంగ్లీషు సినిమాలు అనగానే ‘సూపర్‌మ్యాన్, ‘స్పైడర్ మ్యాన్’, బ్యాట్‌మ్యాన్, ‘అవెంజర్స్’ వంటి సూపర్ హీరోల చిత్రాలే చాలా మందికి గుర్తొస్తాయి. అవి చూసేది కేవలం యాక్షన్, థ్రిల్లర్ కోసం మాత్రమే.
కానీ అంతకంటే మరెన్నో మంచి చిత్రాలు ఉన్నా అవి ఇంగ్లీష్‌లో ఉండటంతో చాలా మంది జంకుతారు. ‘తినగ తినగ వేము తియ్యనుండు’ అనే సామెతలా ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఉంటే అవే అర్థం అవుతూ భాషపై పట్టువస్తుంది. వారు పలికేది అర్థం కాకపోతే సబ్‌టైటిల్స్‌తో చూస్తే చాలా ఉపయోపడుతుంది. తెలుగు చిత్రాలకు కూడా ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ వస్తున్నాయి. వాటిని ఆన్‌లో పెట్టుకుని చూడడం ఉత్తమం.
పాడ్‌కాస్ట్ వినండి : ప్రస్తుతకాలంలో దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, హెడ్‌సెట్ ఉంటున్నాయి. వీలు చిక్కినప్పుడల్లా చాలా మందికి మ్యూజిక్ వినడం అలవాటే. అప్పుడప్పడు ఇంగ్లీషు పాటలు వింటుంటే మేలు జరగుతుంది. ఇప్పుడు దాదాపు అన్ని మ్యూజిక్ ప్లేయర్లలో పాడ్‌కాస్ట్‌లు వస్తున్నాయి. మీకిష్టమైన సబ్జెక్ట్‌కు సంబంధించిన పాడ్‌కాస్ట్‌ను ఇంగ్లీష్‌లో వినండి. అలాగే వీలైతే ఆడియో బుక్స్ కూడా వినండి. దీని వల్ల ఆంగ్ల పదాలు పలికే విధానం తెలుస్తుంది.
మీకు వార్తలంటే ఇష్టముంటే రోజూ ఇంగ్లీష్ న్యూస్‌పేపర్లను తిరగేయండి. మీ చుట్టూ జరిగే వార్తల గురించి చదువుతూ ఉంటే కొత్త కొత్త పదాలు అవే వస్తాయి. ఏవైనా తెలియకపోతే డిక్షనరీని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మొబైల్స్‌లోనూ డిక్షనరీ యాప్‌లున్నాయి. టైప్ చేసిన వెంటనే పదానికి అర్థం తెలుస్తుంది. రోడ్లపై కనిపించే ప్రకటనల యాడ్‌బోర్డులు ఎక్కువగా ఇంగ్లీష్‌లో ఉంటాయి. వీటిని చదివి అర్థం తెలియకపోతే డిక్షనరీలో వెతికితే ఎప్పటికీ గుర్తుంటాయి.
అలాగే, ఎక్కువగా కార్లను గమనించండి. వీటి పేర్లు అనేకం ఉంటాయి. omni అనేది మారుతి సుజుకీ కంపెనీ వాహనం. దీని అర్థం a vehicle used for several purposes.ఇలా నూతన పదాలు, అర్థాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు అందరూ వాట్సాప్‌ను వాడుతున్నారు. ఏదో ఒక గ్రూపులో మీరూ సభ్యులుగా ఉంటారు. అప్పుడప్పుడూ మీ అభిప్రాయాలను ఇంగ్లీషులో తెలియజేస్తూ ఉండండి. అలాగని గ్రూపులో మీ భాషా తప్పుల్ని ఎత్తి చూపుతారని భయపడకండి. చాలా మంది ఇలా భయపడే ముందడుగు వేయలేరు.