How To Search For Jobs Aligned With Age :జాబ్ కోసం సెర్చ్ చేసే వారు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మీ వయసు ఎంత? అనుభవం ఎన్నేళ్లు? అనేది దృష్టిలో ఉంచుకోవాలి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగాలకు ఎడాపెడా అప్లై చేస్తుంటే ఫలితాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే చాలా కంపెనీలు వెలువరించే జాబ్ నోటిఫికేషన్లు ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోవడంపైనే ఫోకస్ పెట్టి ఉంటాయి. ఈ విషయాన్ని పట్టించుకోకుండా మనం అప్లై చేస్తే ఏం లాభముంటుంది? వయసు, అనుభవానికి తగిన జాబ్ రోల్ కోసం వెతకడానికి ముందు మన స్కిల్స్‌ను సానబెట్టుకోవాలి. మీరు కోరుకున్న ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల్ని అందిపుచ్చుకోవాలి. సీనియారిటీ ఉన్నా, సరైన సాంకేతిక నైపుణ్యాలు, అవగాహనా పరిజ్ఞానం లేకుంటే ఉద్యోగ పోటీలో విజేతగా నిలవడం కష్టతరంగా మారుతుంది. తక్కువ హోదాలో, తక్కువ జీతంతో ఎక్కువ గంటల పాటు పనిచేసేందుకు యువ ఉద్యోగార్థులు రెడీగా ఉన్న ప్రస్తుత తరుణంలో సీనియారిటీ కలిగిన అభ్యర్థికి ఉద్యోగం దొరకాలంటే, వారికి పదునైనా ఉద్యోగ నైపుణ్యాలు ఉండాల్సిందే. అందుకే అభ్యర్థులు తమ వయసుకు అనుగుణమైన వ్యూహంతో ఉద్యోగానికి అప్లై చేయాలి.
20 నుంచి 30 ఏళ్ల మధ్యలో
సాధారణంగా చాలా మంది తమ కెరీర్‌ను 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ప్రారంభిస్తుంటారు. ఒకవేళ మీరు Gen Z లేదా లేట్ Gen Y అయినా వయస్సు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్య ముగిసిన తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరడం ఎంత ముఖ్యమో, ఆ ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఒకవేళ నైపుణ్యాలను పెంచుకోకుండా పనిచేస్తూ కాలం వెళ్లదీసే వ్యక్తికి, తదుపరి కెరీర్‌లో ప్రాధాన్యం తగ్గుతూపోతుంది. కాలేజీ దశలో ఉండగానే రెజ్యూమ్ తయారు చేయడం, ఇంటర్వ్యూలకు హాజరుకావడం, కేస్ స్టడీ ప్రిపరేషన్ వంటివి నేర్చుకోవాలి. కాలేజీ లేదా యూనివర్సిటీలో ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్ విభాగాల సేవలను వాడుకోవాలి. తదుపరిగా Coursera, Udemy వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సర్టిఫికెట్ కోర్సులను చేయొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ , టీమ్ వర్క్, లీడర్‌షిప్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. కాలేజీ క్యాంపస్ దశ ముగిసిన తర్వాత ఉద్యోగ మేళాలకు హాజరుకావాలి.