Highest Paying Jobs In India :మన దేశంలో చాలా మంది అధిక జీతం ఇచ్చే ఉగ్యోగాలు వెతక్కుంటూ విదేశాలకు వెళుతుంటారు. కానీ సరైన నైపుణ్యాలు, విద్యార్హతలు, అనుభవం ఉంటే భారత్‌లోనే అధిక వేతనాలు పొందొచ్చు. ఏడాదికి రూ.70 లక్షల వరకు వార్షిక వేతనాన్ని తీసుకోవచ్చు. మరి అలాంటి ఉద్యోగాలు, వృత్తులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
1. పైలట్ :పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు మన దేశంలో విమానయాన రంగం అభివృద్ది చెందుతోంది. దీంతో పైలట్లకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే పైలట్ కూడా మంచి కెరీర్ కెరీర్ ఆప్షన్. 2023లో అనేక విమానయాన సంస్థలు సుశిక్షితులైన పైలట్లకు ఏడాదికి రూ.70 లక్షల వరకు వేతనం అందించాయి. వాణిజ్య, సైనిక పైలట్లు కెరీర్ ప్రారంభంలోనే రూ.9 లక్షల వార్షిక వేతనాన్ని అందుకుంటారు.
విద్యార్హత : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసినవారు, ఏవియేషన్ కోర్సులు చేసి పైలట్ కావచ్చు.
2. బిజినెస్ అనలిస్ట్ :ఈ ఆర్థిక ప్రపంచంలో బిజినెస్ అనలిస్ట్‌లుగా రాణించడం అంత ఈజీ కాదు. అందుకే చాలా తక్కువ మంది బిజినెస్ అనలిస్ట్ కెరీర్‌ను ఎంచుకుంటారు. మన దేశంలో వ్యాపారాల మధ్య పోటీ రోజురోజుకి పెరిగిపోతుంది. మార్కెట్లో సంస్థల మధ్య పోటీతత్వాన్ని విశ్లేషించేందుకు బిజినెస్ అనలిస్ట్ అవసరం ఎంతైనా ఉంది. బిజినెస్ అనలిస్ట్, రిలేషన్ షిప్ మేనేజర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, రిస్క్ మేనేజర్ వంటి ఉద్యోగులు ఏడాదికి రూ. 4 లక్షల నుంచి రూ.34 లక్షల వరకు జీతాన్ని పొందుతున్నారు.
విద్యార్హత : డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బ్యాంకింగ్ ఆపరేషన్స్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సేల్స్‌పై సమగ్ర పరిజ్ఞానం కలిగి ఉండాలి.
3. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. ఏఐ టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యోగాలు ఊడుతున్నాయి. అయితే ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 2023లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక వెబ్సైట్ లో మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల్లో జాబ్‌కు సంబంధించి ఓ పోస్ట్ చేసింది. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల్లో అనుభవం ఉన్న మేనేజర్ కావాలని పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఉద్యోగానికి ఏడాదికి రూ.2.4 కోట్ల నుంచి రూ.7.4 కోట్ల వేతనాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిని బట్టే అర్థం అయ్యి ఉంటుంది మీకు, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ ఉద్యోగానికి ఉన్న ప్రాముఖ్యత. ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ దాదాపు రూ. 45 లక్షల వార్షిక వేతనాన్ని సంపాదించవచ్చు.