తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఎగ్జామ్​ టైమ్​లో పుస్తకం తీయగానే నిద్ర వస్తుందా? - ఈ టిప్స్‌ వాడండి - EXAMS TIME READING

పుస్తకం చదవడం ప్రారంభించగానే నిద్రను అధిగమించేలా సలహాలు, సూచనలు - ఈటీవీ భారత్‌లో మీకోసం కొన్ని టిప్స్‌!

BOOK READING TIPS IN DAILY ROUTINE
పుస్తకం చదవడం ప్రారంభించగానే నిద్ర వస్తుందా? (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2025, 3:41 PM IST

Book Reading Tips : కొందరికి ఇలా పుస్తకం తెరిచి కొన్ని పేజీలు చదవగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది. పరీక్షల సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే చాలా కష్టం. ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్టులు చదవాలంటే అది అయ్యే పని కానే కాదు. మరి, ఈ సమస్యను అధిగమించడం ఎలా? అనే దానిపై ఈటీవీ భారత్ సూచించే కొన్ని టిప్స్‌ మీకోసం!

  1. చదివేటప్పుడు మీరు కూర్చొనే విధానం ఎంతో ముఖ్యం. చాలా మంది టేబుల్‌ బల్లపై పుస్తకాలు పెట్టుకుని కుర్చీలో కూర్చుని చదువుతుంటారు. నిజానికి ఇది చాలా మంచి పద్ధతే. కానీ, కొందరు మంచాలపై కూర్చుని లేదా పడుకొని చదువుతుంటారు. ఇలా చేయడం వల్ల శరీరం మంచి విశ్రాంతిని కోరుకుంటుంది. ఆ సమయంలో త్వరగా నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది.
  2. కూర్చొని చదువుతున్నప్పుడు తరచూ నీళ్లు తాగతూ ఉండాలి. ఈ అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. డీహైడ్రేట్‌ అయితే అలసట, తలనొప్పికి గురై పుస్తకం చదవాలనే ఆసక్తి తగ్గిపోతుంది.
  3. కొంతమంది రాత్రి సమయంలో ఒక రూంలో బెడ్‌ లైటు వేసుకుని ఆ వెలుగులోనే చదువుతుంటారు. దీంతో వెలుతురు తక్కువై యాక్టివ్‌గా ఉండలేరు. తద్వారా త్వరగా నిద్ర రావాడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
  4. భోజనం ఎక్కువగా తిని చదవడానికి కూర్చోవడం వల్ల మత్తుగా ఉండి కళ్లు మూతలు పడతాయి. చదవడానికి ముందు అవసరమైన దానికంటే కొద్దిగా తక్కువ తినడమే మంచిది. దీంతో నిద్ర మత్తు మిమ్మల్నీ ఆవరించకుండా చురుగ్గా ఉండగలుగుతారు.
  5. పగటిపూట కళ్లు మూతలు పడుతున్నాయంటే దానికి అర్థం రాత్రి సరిపడా నిద్రపోలేదనే. రాత్రిళ్లు తగినంత నిద్ర ఉండేలా చూడాలి. ఎందుకంటే నిద్రపోవడం వల్ల బాడీ రిస్టార్ట్‌ అవుతుంది. రాత్రి త్వరగా నిద్రపోయి తెల్లవారుజామునే లేవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అప్పుడే మెదడు చురుగ్గా ఉండటమే కాకుండా ఆ సమయంలో చుట్టుపక్కల వాతావరణం కూడా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.
  6. పరీక్ష సమయంలో ఉదయమే లేచి చదవడం అవసరమవుతుంది. అలాంటప్పుడు మధ్నాహ్నం పూట నిద్ర మత్తు వస్తుంటుంది. అప్పుడు కాసేపు కునుకు తీస్తే ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో మీ చదువును కొనసాగించవచ్చు.
  7. చదివేటప్పుడు కునుకు రాకుండా నట్స్‌, ప్రొటీన్‌ బార్లు, చాక్లెట్లు వంటివి అందుబాటులో ఉంచుకోండి. వీటివల్ల శరీరం మరీ తొందరగా నిద్రావస్థలోకి జారుకోదు. వీటిని తినడం వల్ల శక్తి కూడా శరీరానికి లభిస్తుంది. మత్తుగా అనిపించినప్పుడు టీ, కాఫీ వంటివి తీసుకోవడం ద్వారా కొంత చురుకుదనం లభిస్తుంది.
  8. రాత్రుళ్లు ఆసక్తిగా, కాస్త సరళంగా ఉండే సబ్జెక్టులను చదవడం మంచిది. రాత్రే ఆసక్తిలేని వాటిని చదివితే విసుగు, అనంతరం నిద్రా ముంచుకొస్తాయి. సాధారణంగా వేకువజామున మానవ మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. అప్పుడే నిద్ర లేవడం వల్ల శారీరకంగానూ మంచి ఉత్సాహంగా ఉంటారు. అందువల్ల ఈ సమయంలో కఠినంగా ఉండే సబ్జెక్టులను చదివితే సులువుగా అర్థమవుతుంది.
  9. ఒకే స్థితిలో కూర్చొని ఎక్కువ సమయం చదవడం వల్ల బద్ధకంగా, నిద్ర మత్తుగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడూ కుర్చీలో నుంచి లేచి కాస్త అటూఇటూ తిరగడం, కాళ్లూచేతులను కదిలించడం లాంటివి చేయడం ద్వారా నిద్రమత్తును అధిగమించవచ్చు.
  10. నిద్ర ముంచుకొస్తున్నప్పుడు మీరు రోజులో చదివిన దాన్ని గుర్తున్నంత వరకూ, ఒకసారి చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. ఇలా రాయాలంటే అప్పటివరకూ చదివిన దాన్ని మీ జ్ఞాపకశక్తి మేరకు గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ క్రమంలో లేజినెస్‌ వదిలి మెదడు యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెడుతుంది. బయటకి చదవడం కూడా మంచి చిట్కానే. దీంతో మీ గొంతు మీకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. నిద్ర మత్తు వదిలి చురుగ్గా పుస్తకాన్ని అందులోని సబ్జెక్టును చదవగలుగుతారు.

ABOUT THE AUTHOR

...view details