Exams Preparation Material List: పిల్లలకు పరీక్షల సమయం దగ్గరపడుతోంది. మంచి మార్కులు తెచ్చుకోవాలనే లక్ష్యంతో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఈ క్రమంలోనే వాళ్ల స్టడీ టేబుల్ మొత్తం టైమ్‌టేబుల్, కాగితాలు, పుస్తకాలు, నోట్ బుక్స్‌తో నిండిపోతుంది. ఇక వీటన్నింటితో కొన్నిసార్లు గజిబిజిగా ఫీలవుతుంటారు. పోనీ ఏవైనా తీసేద్దామంటే అన్నీ కావాల్సినవే. దీంతో ఆ వస్తువులు మొత్తం చిందరవందరగా మారతాయి. కావాల్సిన వస్తువులు దొరక్క చిరాకుగా ఫీలవుతుంటారు. చిరాకు ఎక్కువైతే చదువుపై కాన్సట్రేషన్ చేయలేరు. అందుకే పిల్లలకు పనికొచ్చే ఈ వస్తువులను ట్రై చేయమంటున్నారు నిపుణులు. వీటి వల్ల చదువుకునే ప్లేస్ నీట్‌గా పాటు పిల్లలు ప్రశాంతంగా చదవగలుగుతారని చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కళ్లముందే టైమ్‌టేబుల్:ఈరోజు ఇన్ని పాఠాలు చదవాలి, ఈ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి, ఇంతసేపు బ్రేక్ తీసుకోవాలి అంటూ పరీక్షల సమయంలో పిల్లలు బోలెడు ప్లాన్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లాన్స్ కళ్లముందు కనిపిస్తోంటే జాగ్రత్తగా, ఉత్సాహంగా చదువుకోగలుగుతారు. అందుకు సాయపడుతుందీ "అక్రిలిక్ ఎల్‌ఈడీ రైటింగ్ బోర్డు". కరెంట్‌తో పనిచేసే దీని మీద, మార్కర్‌తో ఈరోజు ఏం చేయాలో రాసుకుని అనుసరిస్తే సరి. కొన్నింట్లో భోజనవేళలు, తాగాల్సిన నీరు వంటివీ యాడ్ చేసుకునేలా ఉంటాయి.
మోడ్రన్ పలక: టెక్ట్స్‌బుక్స్, నోట్స్, ప్రాక్టీసు పేపర్లు ఒక్కో సబ్జెక్టుకీ ఎంత సరంజామానో! వీటన్నింటి మధ్యా ప్రాక్టీసు కోసం అదనంగా ఇంకో పుస్తకం అవసరమా అనిపించి, చిన్నచిన్న లెక్కలు, ఈక్వేషన్లను ఏ పేపరు మూలనో, పుస్తకం అంచునో చిన్న ఖాళీ ఉన్న చోట చేసేస్తుంటారు. ఆ ఇబ్బంది లేకుండా ఈ డెస్క్‌టాప్ వైట్‌బోర్డు తెచ్చివ్వండి. తరువాత చేద్దామనుకున్న పనులు, సిలబస్, లెక్కలు, సందేహాలు ఇలా ఏవైనా రాసిపెట్టుకోవచ్చు. పూర్తయ్యాక తుడిపేయొచ్చు. మొబైల్, ట్యాబ్‌ల్లో చదువుకోవాలన్నా పెట్టుకునేలా ఉంటుంది దీని డిజైన్. ఇంకా దీని కింద స్టోరేజీలో పెన్, పెన్సిల్ వంటివన్నీ పెట్టుకోవచ్చు.