CBSE vs ICSE vs State Board :కొన్ని సంవత్సరాల క్రితం వరకు టెన్త్, ఇంటర్ అంటే రాష్ట్రాల గుర్తింపు పొందిన విద్యాసంస్థలు మాత్రమే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి గల్లీలో ఓ సెంట్రల్ బోర్డ్ గుర్తింపు పొందిన విద్యాసంస్థ కనిపిస్తోంది. అందులోనూ.. CBSE, ICSE అంటూ వేర్వేరు బోర్డులు ఉంటున్నాయి. దీంతో.. పిల్లలను ఎందులో చేర్చాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నలకు ప్రముఖ కెరియర్ కౌన్సెలర్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
స్టేట్ Vs సెంట్రల్..
స్టేట్ బోర్డ్ తో పోలిస్తే.. CBSE, ICSE బోర్డులు విభిన్నంగా ఉంటాయని రాజశేఖర్ చెబుతున్నారు. రాష్ట్రాల బోర్డ్ పరిధిలో ఉండే అనేక పాఠశాలల్లో మార్కులు, పరీక్షా ఫలితాల శాతంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని చెప్పారు. అందుకే చాలా సందర్భాల్లో విద్యార్థులు పొందే మార్కులకూ, వారికి ఉన్న విజ్ఞానానికి ఎక్కడా పొలిక ఉండట్లేదని అన్నారు. టెన్త్, ఇంటర్ లో 30శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన చాలామంది.. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో కనీస మార్కులు పొందలేక పోతున్నారని చెబుతున్నారు.
అదే సమయంలో CBSE, ICSE బోర్డుల్లో ఎక్కువ మార్కులు పొందలేకపోయినప్పటికీ.. జాతీయ, అంతర్జాతీయ ప్రవేశ పరీక్షల్లో కొంతమేరకు మెరుగైన ప్రతిభను చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూసుకున్నప్పుడు.. సెంట్రల్ బోర్డుల్లో చదివినవారిలో చాలామందికి మార్కులకంటే.. నైపుణ్యాలు, అవగాహన సామర్థ్యాలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ విశ్లేషించారు.
ఈ బోర్డు ఇలా.. ఆ బోర్డు అలా..
CBSE, ICSE అనేవి సెంట్రల్ బోర్డులు అయినప్పటికీ.. వీటిలోనూ తేడాలు ఉన్నాయని రాజశేఖర్ చెబుతున్నారు. CBSE సిలబస్ కొంతమేర మ్యాథ్స్, సైన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. JEE, NEET లాంటి పోటీ పరీక్షల సన్నద్ధతకు ఉపయోగపడేలా ఉంటుందని అంటున్నారు. ICSE విషయానికి వస్తే.. మ్యాథ్స్, సైన్స్ తోపాటు ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇస్తారు. స్టేట్, CBSE బోర్డులతో పోల్చినప్పుడు ICSE బోర్డుకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో ఫీజు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.