CBSE Scholarship : పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిలకు గుడ్ న్యూస్. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని విద్యలో ప్రోత్సహించేందుకు సీబీఎస్‌ఈ(CBSE) ఏటా ఒక అద్భుతమైన స్కాలర్షిప్ని అందిస్తోంది. ప్రతినెల రూ. 1000 రెండు సంవత్సరాలు పొందే సువర్ణావకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే 2024 సంవత్సరానికి సంబంధించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది సీబీఎస్‌ఈ. అయితే, ఈ స్కాలర్‌షిప్ పొందాలంటే విద్యార్థినులకు ఉండాల్సిన అర్హతలేంటి? దరఖాస్తుకి చివరి తేదీ ఎప్పుడు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీ చూద్దాం.
సీబీఎస్‌ఈ అందిస్తోన్న 'సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్‌షిప్‌నకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ఇప్పటికే పొడిగించిన గడువు ముగియడంతో మరోసారి పొడిగించింది. దాంతో సీబీఎస్‌ఈ (CBSE) పదో తరగతి పరీక్షల్లో 70శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినులు 2025 ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
అర్హతలు :
- ఈ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు సీబీఎస్‌ఈలో పదో తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే, ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల్లో 11, 12వ తరగతులు చదువుతుండాలి.
- పదో తరగతి పరీక్షల్లో కనీసం 70శాతం, ఆపైన మార్కులు సాధించిన వారే ఈ స్కాలర్‌షిప్ ద్వారా అందే డబ్బులు పొందడానికి అర్హులు.
- అలాగే, విద్యార్థిని ట్యూషన్ ఫీజు పదో తరగతిలో నెలకు రూ.2500; సీబీఎస్‌ఈ 11, 12 తరగతులకు రూ.3వేలు మించకుండా ఉండాలి.
- సీబీఎస్‌ఈ బోర్డులో విద్యనభ్యసిస్తున్న NRI విద్యార్థినులు కూడా ఈ స్కాలర్షిప్కి అర్హులే. అయితే, వీరి ట్యూషన్ ఫీజు నెలకు రూ.6వేల కంటే ఎక్కువగా ఉండొద్దు.
- ఇప్పటికే ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
- 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్ చేయించుకోవాలంటే సదరు విద్యార్థినులు కనీసం 70శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి.
- పేరెంట్స్ వార్షికాదాయం రూ.8లక్షల కన్నా తక్కువ ఉండాలి.
స్కాలర్‌షిప్ వివరాలు : సీబీఎస్‌ఈ అందిస్తోన్న ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులకు ప్రతి నెలా ₹1000 చొప్పున రెండు సంవత్సరాలు పాటు అందజేస్తారు. విద్యార్థినికి చెందిన అకౌంట్లోనే ఈ మొత్తాన్ని జమ చేస్తారు.