Why Indians Prefer Manual Cars Over Automatic : ఇండియాలో కొవిడ్ మహమ్మారి తర్వాత ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లను చాలా మంది కస్టమర్లు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే డ్రైవింగ్ చేయడానికి సులువుగా ఉంటుందని, ప్రత్యేకించి ట్రాఫిక్ ప్రాంతాలలో తరచుగా గేర్లు మార్చడం, క్లచింగ్ అవసరం ఉండదనే ఉద్దేశంతో వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వాహనాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, ఇండియాలో మెజార్టీ పీపుల్.. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లను(Car) తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందుకు గల కారణాలను కూడా వివరించాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ధర విషయంలో తేడాలు :ఇండియాలో ఎక్కువ మంది మాన్యువల్ కార్లపై మొగ్గు చూపడానికి ధర ప్రధాన కారణమని చెబుతున్నారు నిపుణులు. AMT కార్లతో పోల్చితే మాన్యువల్ కార్ల ధర చాలా తక్కువగా ఉంటుంది. స్పిన్నీ నివేదిక ప్రకారం.. మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్ కంటే ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కారు ధర సుమారు రూ. 80,000 ఎక్కువ. కొనుగోలుదారు మాన్యువల్ వేరియంట్ కంటే AMT వేరియంట్ కారు కోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంటోంది.
బీమా ఖర్చులు : ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సాంకేతికత కారణంగా కారు అధిక ధర.. కొనుగోలుదారు ఇన్సురెన్స్ ఖర్చులను పెంచుతుంది. దాంతో వాహనం మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఈ వ్యత్యాసం ఎంట్రీ-లెవల్ వాహనాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా కొనుగోలుదారులకు గణనీయమైన కొనుగోలు ఖర్చులు ఏర్పడతాయి. ఈ కారణంగా చాలా మంది వినియోగదారులు స్టిక్కర్ ధర, బీమా ఖర్చులపై డబ్బు ఆదా చేసేందుకు మాన్యువల్ వేరియంట్‌లను ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
మెయింటెనెన్స్ ఖర్చులు :ఎక్కువ మంది మాన్యువల్ కార్ల వైపు ఇంట్రెస్ట్ చూపించడానికి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఒక కారణమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్ కార్ల నిర్వహణ మాన్యువల్ గేర్ బాక్స్ వాహనాల కంటే ఖరీదైనది. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ల కంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు చాలా క్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా యజమాని నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. అదే విధంగా ఏఎమ్టీ కార్లతో పోల్చితే మాన్యువల్ కార్లలో రెగ్యులర్ ఆయిల్ మార్చడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే.