what to do if Health Insurance Claim is Rejected : ప్రస్తుత కాలంలో వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. కనుక పెరిగిన వైద్య ఖర్చులను ఎదుర్కోవాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అందుకే చాలా మంది ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటున్నారు. అయినప్పటికీ వాటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల బీమాను క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా కొన్నిసార్లు బీమా తిరస్కరణకు కూడా గురవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం బీమా పాలసీలను అర్థం చేసుకోవడం కాస్త సులభతరమైంది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) కాలనుగుణంగా పాలసీల నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేస్తూనే ఉంది. పాలసీదారులకు బీమా సమాచారం అర్థమయ్యేలా పత్రాలు ఇవ్వాలని సంస్థలకు సూచించింది. ఐఆర్డీఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగానే బీమా కంపెనీలు ఆరోగ్య బీమాను జారీ చేస్తున్నాయి. అయితే చాలా మంది ఆంగ్లంలో ఉన్న బీమా పాలసీ నిబంధనలు చదివి, అర్థం చేసుకోలేరు. అందుకే ఇప్పుడు కొన్ని కీలకమైన ఆరోగ్య బీమా పాలసీ నిబంధనలు గురించి తెలుసుకుందాం.
సరైన ఆరోగ్య సమాచారాన్ని ఇవ్వకపోవడం
ఆరోగ్య సమాచారం సరిగా లేకపోవడం వల్ల కూడా క్లెయిమ్ రిజక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పాలసీని కొనుగోలు చేసే సమయంలో వ్యక్తులు తమ ఆరోగ్యం గురించి సరైన వివరాలను అందించాలి. ఇప్పటికే ఉన్న వ్యాధుల వివరాలు పూర్తిగా తెలియజేయాలి. తద్వారా బీమా సంస్థ దీన్ని అర్థం చేసుకొని, సరైన పాలసీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ముందస్తు వ్యాధుల గురించిన సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా బీమా సంస్థ ఇచ్చే సూచనలు చాలామంది పట్టించుకోరు. క్లెయిమ్ సందర్భంలో ఇలాంటివి బయటపడినప్పుడు, పాలసీ రిజెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది. కొన్నిసార్లు బీమా సంస్థలు పాలసీని పూర్తిగా రద్దు చేసే అవకాశాలూ ఉంటాయి.
శాశ్వత మినహాయింపులు, నిరీక్షణ వ్యవధి
కొన్ని రకాల వ్యాధులకు బీమా పరిహారం ఇచ్చేందుకు నిర్ణీత కాలంపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఈ గడువులోగా క్లెయిమ్ చేస్తే బీమా సంస్థ దాన్ని చెల్లించకపోవచ్చు. ఈ వేచి ఉండే వ్యవధి ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఉండొచ్చు. ఈ వ్యవధి ముగిసిన తర్వాతే వీటికి బీమా రక్షణ ప్రారంభమవుతుంది. కొన్ని వ్యాధులకు శాశ్వతంగా మినహాయింపు వర్తిస్తుందని పాలసీ ఇచ్చేటప్పుడే ఆయా బీమా సంస్థలు చెబుతాయి. అలాంటప్పుడు ఆ వ్యాధుల చికిత్సకు అయిన మొత్తానికి బీమా సంస్థల నుంచి పరిహారం రాదు.
సరైనా డాక్యుమెంట్లు సమర్పించకపోయినా
బీమా క్లెయిం చేసుకోవాలంటే సరైన డాక్యుమెంట్లు తప్పనిసరి. సరైన పత్రాలు లేకపోయినట్లయితే బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. చాలా వరకు చెల్లించిన బిల్లులను రీయింబర్స్మెంట్ చేయమని అడిగినప్పుడు ఇలా క్లెయిమ్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల పూర్తి పరిహారం పొందాలంటే, పాలసీదారులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. ఆసుపత్రి నుంచి బిల్లులు, పత్రాలు, మెడికల్ రిపోర్ట్లు తదితర అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తీసుకోవాలి. మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ డాక్యుమెంట్లు అన్నీ తప్పనిసరి. అదనపు సమాచారం అవసరమైనప్పుడు బీమా సంస్థలు పాలసీదారులకు ఆ మేరకు సమాచారాన్ని ఇస్తాయి.
మోసపూరిత క్లెయిమ్స్ విషయంలో
పాలసీదారులు లేదా ఆసుపత్రులు కొన్నిసార్లు అవాస్తవ సమాచారంతో క్లెయిమ్‌లను దాఖలు చేయడం జరుగుతుంది. వాస్తవ ఖర్చులు గురించి చెప్పకుండా, ఉన్నవాటి కంటే కాస్త అధికంగా బిల్లులు వేయడం, ఔట్ పేషెంట్ చికిత్సలకు బదులు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం, ముందస్తు వ్యాధులను దాచి పెట్టి, చికిత్స చేయించుకోవడం లాంటివి ఉంటాయి. వీటిని బీమా సంస్థ గుర్తిస్తే, పరిహారంలో కోత విధించడం లేదా పూర్తిగా రిజెక్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు ఆసుపత్రిలో చేరకుండానే నకిలీ బిల్లులు సృష్టించి, క్లెయిమ్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటిని తీవ్ర మోసాలుగా పరిగణిస్తారు. ఇలాంటప్పుడు బీమా సంస్థ పాలసీని రద్దు చేయడంలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌ను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో కచ్చితంగా పాలసీదారులకు తెలియజేయాలి. ఈ విషయంలో నియంత్రణ సంస్థ ఇచ్చిన ఆదేశాలను బీమా సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.