Retirement Planning Tips : పదవీ విరమణ అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఇది ఒక వ్యక్తి ఉద్యోగ జీవితం నుంచి విశ్రాంతి కాలానికి మారడాన్ని సూచిస్తుంది. అయితే భారతదేశంలోని చాలా మంది ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఖర్చులను తట్టుకోవడానికి తగిన ప్రణాళిక వేసుకోవడం లేదు. వాస్తవానికి భారతదేశంలో మెజారిటీ ప్రజలకు పదవీ విరమణ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు అని ఇటీవల ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం, మన దేశంలోని ప్రతి నలుగురిలో ముగ్గురు తమ పదవీ విరమణ కోసం పొదుపు చేయడంలో విఫలమవుతున్నారు. ఇలాంటి వారు తమ జీవిత చరమాంకంలో పిల్లలపై ఆధారపడుతున్నారు. అందుకే పటిష్ఠమైన పదవీ విరమణ ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం. దీని వల్ల రిటైర్ అయిన వ్యక్తి ఆర్థిక భవిష్యత్ భద్రంగా ఉంటుంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, పదవీ విరమణ ప్రణాళిక ఆర్థిక భద్రతకు మించిన అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అందువల్ల రిటైర్ అయిన తరువాత ఆర్థికంగా సురక్షితమైన, సంతృప్తికరమైన జీవితం గడపడానికి కచ్చితమైన పదవీ విరమణ ప్రణాళిక రూపొందించుకోవడం చాలా ముఖ్యం.
పదవీ విరమణ ప్రణాళిక
వృద్ధాప్యంలో ఆర్థిక స్థిరత్వం, స్వాతంత్ర్యం కోసం పదవీ విరమణ ప్రణాళిక చాలా అవసరం. నేడు మనుషుల జీవిత కాలం పెరుగుతోంది. కుటుంబాలు చిన్నవి అవుతున్నాయి. మరోవైపు రోజురోజుకూ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అందువల్ల ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో సహా, సురక్షితమైన రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది.
పదవీ విరమణ తర్వాత సాధారణంగా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. సంవత్సరాల తరబడి చేసుకున్న పొదుపు డబ్బులు మాత్రమే ఆదాయ వనరుగా మిగులుతాయి. ఇవి జీవితం మొత్తానికి సరిపోవు. అందుకే పనిచేసే సమయంలోనే మంచి రిటైర్మెంట్ ప్లాన్ వేసుకోవాలి.
పదవీ విరమణ ప్రణాళిక ఎందుకు అవసరమంటే, ఇది మీరు రిటైర్ అయిన తర్వాత కూడా పాత జీవనశైలి ఏ మాత్రం తగ్గకుండా కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. మలి వయస్సులో ఆరోగ్య సంరక్షణ, ప్రయాణాలు, విశ్రాంతి కార్యకలాపాలు లాంటి పలు ఖర్చులను కవర్ చేస్తుంది. అందువల్ల పదవీ విరమణ ప్రణాళిక వేసుకునేటప్పుడు, కచ్చితంగా మీ ప్రస్తుత జీవనశైలి, అభిరుచులు, ఆసక్తులు, పదవీ విరమణ తర్వాత మీ అవసరాలు, మీపై ఆధారపడిన వారి సంఖ్య, ద్రవ్యోల్బణం మొదలైన అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఆయుర్ధాయం
వైద్యరంగ పురోగతి వల్ల మనుషుల ఆయుర్ధాయం పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ విధానాలు మెరుగవ్వడం వల్ల, దేశ జనాభాలో సగానికి పైగా 78 సంవత్సరాలు, లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తున్నారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ, జీవనశైలిలో మార్పులు వల్ల కూడా భవిష్యత్లో మరింత ఎక్కువ కాలం ఆయుర్ధాయం పెరిగే అవకాశం ఉంది. అందువల్ల జీవన వ్యయాలు పెరుగుతాయి. అందుకే మీ సుదీర్ఘ జీవితకాలం కోసం ఇప్పటి నుంచే ఆదా చేసుకోవాల్సి ఉంటుంది.
ఆరోగ్య సంరక్షణ
మలి జీవితంలో వైద్య, ఆరోగ్య ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. మీ ఆదాయంలో దాదాపు 15%-20% వైద్య ఖర్చులకే అయిపోతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం దాదాపు 14%గా ఉంది. అందువల్ల పదవీ విరమణ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం.
పెట్టుబడులు పెట్టాల్సిందే!
పదవీ విరమణ ప్రణాళికకు అనువైన పెట్టుబడి మార్గాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) లాంటి స్థిర రాబడిని, పన్ను ప్రయోజనాల్ని అందించే సంప్రదాయ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి.