What Is Debt Market :చాలా మందికి డెట్ మార్కెట్ గురించి అంతగా అవగాహన ఉండదు. అదేదో బ్రహ్మపదార్థం అని భావిస్తుంటారు. మనం బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటాం. షేర్ మార్కెట్ల నుంచి షేర్ల కొంటుంటాం. అదేవిధంగా డెట్ మార్కెట్ నుంచి బాండ్లు కొనొచ్చు, అమ్మొచ్చు. అందుకే దీనినిబాండ్ మార్కెట్, ఫిక్స్‌డ్ ఇన్‌కం మార్కెట్ అని కూడా అంటుంటారు. ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు, నగర పాలక సంస్థలు డెట్ మార్కెట్‌లో బాండ్లను జారీ చేసి, వాటికి అవసరమైన నిధులను సమీకరిస్తుంటాయి. ఇంతకీ ఈ డెట్ మార్కెట్‌లో ఎన్ని రకాల బాండ్లు ఉంటాయి? అవి ఎలా పనిచేస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభుత్వ బాండ్లు
కేంద్ర ప్రభుత్వ బాండ్లను కొనడం ద్వారా మనం పెట్టే పెట్టుబడిపై నిర్ణీత కాలానికి ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయాన్ని ఆర్జించవచ్చు. వీటిలో పెట్టే పెట్టుబడులకు నేరుగా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ ఇస్తుంటాయి. కాబట్టి ఎలాంటి ఢోకా ఉండదు. అమెరికాలో ప్రభుత్వ బాండ్ల మార్కెట్లో లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. అక్కడితో పోలిస్తే మన దేశంలో ప్రజల ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉన్నందున, ఈ విభాగంలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య తక్కువగా ఉంది. చాలా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, ఎల్‌ఐసీ వంటి సంస్థలు ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు టాప్ ప్రయారిటీ ఇస్తుంటాయి. ప్రత్యేకించి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు తమ పెట్టుబడి నిధిలో కొంత భాగాన్ని తప్పకుండా ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి.
మున్సిపల్ బాండ్లు
మున్సిపాలిటీల వంటి నగర పాలక సంస్థలు, ఇతరత్రా స్థానిక సంస్థలు నిధుల సమీకరణ కోసం డెట్ మార్కెట్‌పై ఆధారపడుతుంటాయి. తమ స్థానిక సంస్థ పేరిట బాండ్లను జారీచేసి నిధులను సేకరిస్తాయి. మన దేశంలోని చాలా మున్సిపాలిటీలు ఇలా నిధులను సేకరించాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ కార్పొరేషన్ల ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలకు నిధులు అవసరమైనప్పుడు ఈ మార్గంలో ఫండ్స్ సేకరిస్తుంటాయి. కొన్ని ప్రఖ్యాత ఐఐటీలు కూడా తమ నిర్వహణ అవసరాల కోసం ఇలా ఫండ్స్‌ను పొందాయి. అందుకే ఈ బాండ్స్ కూడా సేఫ్.
కార్పొరేట్ బాండ్లు
కార్పొరేట్ కంపెనీలు వాటి వ్యాపార అవసరాలకు, విస్తరణ కోసం నిధులు అవసరమైనప్పుడు డెట్ మార్కెట్లో బాండ్లు జారీ చేసి నిధులు సేకరిస్తాయి. బాండ్లను జారీ చేసే కంపెనీ క్రెడిట్ యోగ్యతను బట్టి ఈ బాండ్ల రిస్క్ లెవల్స్ మారుతుంటాయి. అయితే అన్ని కంపెనీలను గుడ్డిగా నమ్మడానికి వీలుండదు. ఆ రంగంలో అవి ఎన్నేళ్లుగా ఉన్నాయి? ప్రస్తుతం వాటి స్థితి ఎలా ఉంది? రానున్న రోజుల్లో ఆ రంగంలో ఆ కంపెనీ పనితీరు ఎలా ఉండొచ్చు? ఇటీవల కాలంలో సదరు కంపెనీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఏమిటి? అందులో చోటుచేసుకున్న కీలక పరిణామాలు ఏమిటి? అనే అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాతే కంపెనీల కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు వేయాలి. మిగతా బాండ్లతో పోలిస్తే ఇవి కొంచెం రిస్కుతో కూడుకున్నవే.