Property Purchase Documents List:ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగం బాగా వృద్ధి చెందుతోంది. అయితే.. భూముల ధరల్లాగే వివాదాలు కూడా పెరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో మోసాలతో కొనుగోలుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే ఏదైనా ఆస్తి కొనేటప్పుడు తప్పకుండా కొన్ని పత్రాలను పరిశీలించాల్సి ఉంటుందని న్యాయనిపుణలు సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పత్రాలు తప్పనిసరి..
భూమిని కొనుగోలు చేసే ముందు చూడాల్సిన ముఖ్యమైన పత్రం మదర్ డీడ్ అని.. ఈ డాక్యుమెంట్ తప్పనిసరిగా చెక్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ పత్రం ద్వారా భూమి యజమాని ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చట. ఇదే కాకుండా ఒకవేళ భూమి యజమాని దానిని విక్రయిస్తే కొనుగోలుదారుకు బదిలీ చేసే సేల్ డీడ్ డాక్యుమెంట్ను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు. ఇంకా భూమిని కొనుగోలు చేసే ముందు ఆ సమయంలో పాత రిజిస్ట్రీని చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. దీనిని పరిశీలించడం వల్ల మీరు కొనుగోలు చేస్తున్న భూమి ఎవరి పేరిట ఉందో స్పష్టంగా తెలుస్తుందని వివరించారు.
ఎన్ఓసీ సర్టిఫికెట్
చాలామంది వ్యక్తులు ఇతరుల పేరిట ఉన్న భూములను మీకు అమ్మే అవకాశం ఉంటుందని.. దీని కోసం ఆ వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. దీంతోపాటు ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ను చూడటం కూడా ముఖ్యమని అంటున్నారు. ఈ సర్టిఫికెట్లో భూమికి సంబంధించిన అన్ని లావాదేవీల రికార్డు ఉంటుందని చెబుతున్నారు. ఇదే కాకుండా ఈ భూమిని విక్రయించడానికి లేదా కొనడానికి ఎవరికి అభ్యంతరం లేదని.. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను కూడా పరిశీలించాలని సూచించారు.
గుర్తింపు పత్రాలు..
భూమి యజమాని మీకు తెలియకపోతే మొదట గుర్తింపు పత్రాలను తనిఖీ చేయాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు. భూమిని కొనుగోలు చేసే ముందు మరీ ముఖ్యంగా యజమాని పూర్తి చిరునామాను కూడా పరిశీలించాలని సలహా ఇస్తున్నారు. దీని కోసం మీరు అతడి చిరునామా రుజువు, బిల్లు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. అలాగే కొనుగోలు చేయబోయే ఆస్తిపై పన్ను చెల్లించారా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించాలని చెబుతున్నారు.