Money Saving Tips : ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సుసంపన్న జీవితాన్ని కోరుకుంటారు. కానీ దాన్ని సాకారం చేసుకునే దిశగా సరైన నిర్ణయాలను సకాలంలో తీసుకోలేక విఫలమవుతుంటారు. జీవితానికి ఆర్థిక భద్రత లభించాలంటే తొలుత మనం స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇందుకోసం కొంచెంకొంచెంగా డబ్బును పొదుపు చేయడం ప్రారంభించాలి. నిత్యావసరాల ధరల మంట, లోన్ ఈఎంఐల భారం, అప్పులపై వడ్డీలు, పన్నుల మోత నడుమ డబ్బులను ప్రతినెలా పొదుపు చేయడం అంటే పెద్ద సవాలే. అయినా ఆర్థిక క్రమశిక్షణతో దాన్ని సాకారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం అనుసరించాల్సిన కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఖర్చులపై పర్యవేక్షణ
తొలుత మీ నెలవారీ ఖర్చులను నిశితంగా పర్యవేక్షించాలి. ప్రతి చిన్న ఖర్చును కూడా నోట్ చేయాలి. ఈ వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ ఫార్మాట్‌లో సేవ్ చేసేందుకు కొన్ని బడ్జెట్ యాప్‌లు, స్ప్రెడ్‌షీట్‌లను మీరు వాడొచ్చు. లేదా పెన్ను, కాగితం వాడొచ్చు. మీకు జీతం పడే అకౌంటు నుంచి పొదుపు స్కీంలకు, పెట్టుబడి పథకాలకు డబ్బులు ప్రతినెలా ఆటోమేటిక్‌గా వెళ్లిపోయేలా బ్యాంకు ద్వారా ఏర్పాట్లు చేయించుకోవాలి. దీనివల్ల స్పష్టమైన డిజిటల్ పేమెంట్ రికార్డ్ అనేది బ్యాంకు వద్ద క్రియేట్ అవుతుంది. ‘మొదటి చెల్లింపు మీకే’ అనే ఈ వ్యూహాన్ని తప్పకుండా ఫాలోకావాలి. ప్రతినెలా స్థిరమైన పొదుపులు జరిగేలా చూసుకోవాలి.
2. వ్యూహాత్మకంగా ఖర్చులను తగ్గించుకోండి
ఖర్చులు రెండు రకాలు. అవి: అవసరం ఉన్నవి, అవసరం లేనివి. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, ఫోన్ రీఛార్జ్, వైఫై బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి సామాన్లు, వైద్య వ్యయాలు వంటివి అవసరమైన ఖర్చులు. సినిమాలు, టూర్‌లు, అకాల షాపింగ్‌లు లాంటివి అనవసర ఖర్చులు. కనుక వీలైనంత వరకు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి.
మీకు ప్రతినెలా వచ్చే ఆదాయాన్ని 50/30/20నిష్ఫత్తిలో విభజించుకోవాలి. 50 శాతం ఆదాయాన్ని మీ అవసరమైన ఖర్చులకు, 30 శాతం ఆదాయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, 20 శాతం ఆదాయాన్ని పొదుపుల కోసం కేటాయించుకోండి. ఇంటి బయట టీ, కాఫీలు, టిఫిన్లు లాంటివి తగ్గించడం మంచిది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, జిమ్ మెంబర్‌షిప్‌లు, ఆన్‌లైన్ డెలివరీ సేవలు మీ ఖర్చులను అనవసరంగా పెంచుతాయి. కనుక అవసరమైనంత వరకే వాటిని వినియోగించుకోండి.