Reliance Disney Merger :రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్ 18, ది వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వినోద వ్యాపారాలు లివీనం కానున్నాయి. ఈ విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో రూ.70,000 కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యంగా వయాకామ్ 18 మారనుంది.
మీడియా ఆస్తుల విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇటీవల ఆమోదించింది. ఈ విలీనం అనంతరం జాయింట్ వెంచర్ ఏర్పాటు కానుందని సీసీఐకు సమర్పించిన నోటీసులో పేర్కొంది. ఈ లావాదేవీల వల్ల దేశంలోని పోటీ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం పడబోదని రిలయన్స్ వెల్లడించింది. సీసీఐ ఆమోదం పూర్తయిన రెండు రోజులకే ఎన్‌సీఎల్‌టీ సైతం పచ్చజెండా ఊపింది. రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయంపై గురువారం ప్రస్తావించారు. రిలయన్స్, వాల్ట్ డిస్నీ వీడియా ఆస్తుల విలీనం, దేశంలో వినోద పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలికిందని పేర్కొన్నారు. రిలయన్స్ కుటుంబంలోకి డిస్నీని స్వాగతిస్తూ, జియో, రిటైల్ వ్యాపారం లాగే ఈ మీడియా వ్యాపారం రిలయన్స్ గ్రూప్‌లో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.