Things To Check Before Buying A Car : కొత్తగా కారు కొనాలనుకునే వారు కారు కంఫర్ట్‌ను మాత్రమే కాకుండా అందులోని సేఫ్టీ ఫీచర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ కంపెనీ కారు కొనేముందైనా అందులో ఈ కింది అంశాలు ఉన్నాయా? లేవా? అని చెక్ చేసుకొని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీకు, మీ కుటుంబ సభ్యుల భద్రతకు ముడిపడిన అంశం కాబట్టి. మరి ఆ సేఫ్టీ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్‌బ్యాగ్స్
ఎయిర్‌బ్యాగ్స్- కారులోనే అత్యంత ప్రధానమైన సేఫ్టీ ఫీచర్. ముఖ్యంగా మీరు తీసుకునే కారులో ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయా? లేవా? అని చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ప్రమాద తీవ్రతను ఇవి తగ్గిస్తాయి. అయితే చాలా వరకు కార్లు ఎయిర్‌బ్యాగ్స్‌తో వస్తున్నా, అందులో కేవలం 2 ఎయిర్‌బ్యాగ్స్‌ను మాత్రమే ఏర్పాటు చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని కంపెనీలు 6 వరకు ఎయిర్‌బ్యాగ్స్‌ను కూడా తమ వినియోగదారుల భద్రత దృష్ట్యా కార్లలో ఫిక్స్ చేస్తున్నాయి. ఇలా 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కారులను మాత్రమే కొనుగోలు చేస్తే భద్రతపరంగా మీకు, మీ కుటుంబానికి మంచిది!
టీపీఎంఎస్
టీపీఎంఎస్- టైప్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ మీరు కొత్తగా తీసుకునే కారులో ఉందా? లేదా? అని నిర్ధరించుకోండి. ఇది మీ కారు టైర్లు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా సాఫీగా నడిచేలా చేస్తాయి. ఈ వ్యవస్థ మీ కారు చక్రాల్లోని గాలి ఒత్తిడిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు చూసుకోకుండా అలానే రోడ్డుపై నడిపితే ఒక్కోసారి అవి పేలిపోయే అవకాశాలు ఉంటాయి. తద్వారామీరు కంట్రోల్ కోల్పోయి ప్రమాదాల బారిన పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కొనే కారులో టీపీఎంఎస్ ఉంటే ఇది మీ కారు టైర్ల పనితీరు గురించి మిమ్మల్ని లేదా డ్రైవర్‌ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది.
ఇన్-బిల్ట్ నావిగేషన్
ఈ ఇన్-బిల్ట్ నావిగేషన్ అనేది మీ స్మార్ట్‌ఫోన్‌కు పని చెప్పకుండా చేస్తుంది. అంటే మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు మొబైల్లో ఉండే లొకేషన్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఫీచర్ ఉన్న కారును తీసుకుంటే అత్యవసర సమయాల్లో మీకే ఉపయోగపడుతుంది. అయితే ఇలాంటి ఫీచర్‌ను చాలా వరకు కార్లలో ఆప్షనల్ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నాయి పలు కార్ల కంపెనీలు.
పార్కింగ్ సెన్సార్లు
పార్కింగ్ సెన్సార్లు- పేరులోనే దీని ప్రాముఖ్యత గురించి మీకు తెలిసిపోతుంది. ముఖ్యంగా మన కారును పార్క్ చేసే సమయాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటాం. కొన్ని చిన్నపాటి లేదా ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో మీరు ఇతరులకు (వ్యక్తులు, వస్తువులు) ఇబ్బంది లేదా హాని కలగజేయకుండా ఈ పార్కింగ్ సెన్సార్స్ దోహదపడతాయి. మీరు చూసుకోకుండా ఏదైనా వస్తువును లేదా వ్యక్తిని తాకితే కారు లోపల ఉండే స్క్రీన్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. దీనికి తోడు ఓ బీప్ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని కార్లు బ్యాక్ సెన్సార్స్‌తో వస్తున్నప్పటికీ, కొన్ని కంపెనీలు మాత్రమే ఫ్రంట్ సెన్సార్స్ ఫీచర్‌నూ తమ కార్లలోఅమరుస్తున్నాయి. ఇలా రెండు రకాలుగా సెన్సార్లు ఉన్న కారును కొంటే ఉత్తమం.