Senior Citizen ITR Benefits:ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్ కొన్ని కీలక నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారికి ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ ఐటీఐర్ దాఖలుకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక ఫారమ్‌లను అందిస్తుంది. మరెందుకు ఆలస్యం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేసి సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్ గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆదాయం ఆధారంగా ఐటీఆర్ ఫారమ్ ఫైలింగ్
సీనియర్ సిటిజన్స్ వారి ఆదాయం ఆధారంగా నిర్దిష్ట ITR ఫారమ్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న పింఛనుదారులు పన్ను దాఖలు కోసం ఐటీఆర్- 1ను నింపాల్సి ఉంటుంది. ఆస్తి, ఇతర వనరులు, మూలధన లాభాల ద్వారా ఆదాయం పొందినవారు ఐటీఆర్-2ను ఎంచుకోవాలి. వ్యాపారాలు, వృత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదించే పెన్షనర్లు ఐటీఆర్-3 లేదా ఐటీఆర్-4ను ఫైల్ చేయాల్సి ఉంటుంది.
సాధారణ లేదా నాన్-సీనియర్ పన్ను చెల్లింపుదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు అధిక పన్ను మినహాయింపు పరిమితి ఉంటుంది. 60 ఏళ్లలోపు వయసు ఉన్న వారి వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలకు మించి ఉంటే ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ చేయాలి. అయితే సీనియర్ సిటిజన్స్‌కు ఈ మినహాయింపు పరిమితి రూ.3 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్స్ కు(80 ఏళ్లు పైబడినవారికి) రూ.5 లక్షల వరకు ఉంది. అంతేకాకుండా రేట్లు తదనుగుణంగా మారుతూ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్‌కు రూ. 3లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం వరకు పన్ను విధిస్తారు.
ఫారమ్ 16
సీనియర్ సిటిజన్స్, పెన్షన్ రూపంలో ఆదాయం పొందేవారు తమ యజమాని నుంచి ఫారమ్ 16 పొందుతారు. ఉద్యోగులకు కంపెనీ అందించే ఫారమ్ 16లో వేతన ఆదాయం, పన్ను కోతలు, టీడీఎస్ వంటి సమగ్ర సమాచారం ఉంటుంది. కొన్ని ఆర్థిక లావాదేవీలను నిర్దిష్ట పరిమితికి మించి చేసినప్పుడు, సంబంధిత సమాచారాన్ని ఆయా సంస్థలు ఆదాయపు పన్ను శాఖకు అందజేస్తాయి. ఆదాయపు పన్ను శాఖ ఈ సమాచారం మొత్తం ఫారమ్ 26ఏఎస్‌లో పొందుపరుస్తుంది.
పన్ను మినహాయింపులు
60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్స్ 80TTB కింద బ్యాంకు, పోస్టాఫీసు పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వ్యక్తులు ఈ తగ్గింపులు పొందలేరు. ఇది కేవలం పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.