Surge 32 Hero Vehicle :ఎలక్ట్రిక్ బైక్‌ను క్షణాల్లోనే ఆటో రిక్షాగా మార్చుకునేలా ఓ కొత్త వాహనాన్ని హీరో మోటోకార్ప్‌కు చెందిన సర్జ్ స్టార్టప్ రూపొందించింది. ఇటీవల జరిగిన 'హీరో వరల్డ్' ఈవెంట్‌లో దీన్ని ప్రదర్శించారు. సర్జ్ 32 పేరిట ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. స్వయం ఉపాధి పొందే వారి కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.
ఇది టూ-ఇన్- వన్ ఎలక్ట్రిక్ వెహికల్. అవసరాలకు తగ్గట్టుగా కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. వ్యాపార అవసరాల కోసం త్రీవీలర్‌గానూ, వ్యక్తిగత అవసరాల కోసం 2 వీలర్‌గానూ కేవలం మూడు నిమిషాల్లోనే మార్చుకోవచ్చు. సాధారణ ఆటో రిక్షాల మాదిరిగానే ఈ త్రీ వీలర్ ఆటో రిక్షాలోనూ విండ్ స్క్రీన్, హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, విండ్ స్క్రీన్ వైపర్లు ఉన్నాయి. ఆటోకు డోర్లు లేనప్పటికీ జిప్‌తో కూడిన సాఫ్ట్‌డోర్‌లను అందించే అవకాశం ఉంది.
ఇక కొత్త తరహా వాహనంలో త్రీవీలర్, టూవీలర్‌కు వేర్వేరు సామర్థ్యాలు నిర్ణయించారు. త్రీవీలర్‌లో 10KW ఇంజిన్ ఇచ్చారు. 11KWh బ్యాటరీని అమర్చారు. ఇక స్కూటర్‌లో 3KW ఇంజిన్ ఉంటుంది. వ్యక్తిగత అవసరాలకు సరిపోయేలా 3.5 KWh బ్యాటరీని అమర్చారు. త్రీవీలర్ టాప్ స్పీడ్ 50 కిలోమీటర్లు. 500 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. టూవీలర్ గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.