Students Travel Insurance :విదేశాల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఉన్నత చదువుల కోసం విదేశీ విశ్వవిద్యాలయాలను చాలా మంది ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలాంటి వారికి స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అకస్మాత్తుగా వచ్చే ఆర్థిక నష్టాల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. ఇందులో మెడికల్, నాన్ మెడికల్ ఎమర్జెన్సీ బెనిఫిట్స్‌తోపాటు, ఆటోమేటిక్ రెన్యువల్ ఫీచర్లు ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్
- అత్యవసర ఆసుపత్రి ఖర్చులు
- ఊహించని వైద్య ఖర్చులు
- ట్రావెల్ డిలే ఖర్చులు
- శారీరక గాయాలు, ఆస్తి నష్టం, వైద్య బిల్లులు, లీగల్ ఖర్చులు
- ప్రయాణంలో లగేజీ పోయినప్పుడు పరిహారం లభిస్తుంది.
- చదువుల్లో అంతరాయం ఏర్పడినప్పుడు పరిహారం పొందవచ్చు.
- స్పాన్సర్ మరణించిన సందర్భంలో బ్యాలెన్స్ కోర్సు ఫీజును కవర్ చేస్తుంది.
- పాస్‌పోర్ట్ పోయినా ఈ పాలసీ కవర్ చేస్తుంది.
అందుకే విద్యార్థుల విదేశీ పర్యటనల సమయంలో ప్రయాణ బీమా తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఒక విద్యార్థి తన పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకుంటే, ఈ బీమా వారికి తాత్కాలిక పాస్‌పోర్టు అందిస్తుంది.
ప్రయాణ బీమాకు ఎంత ఖర్చు అవుతుంది?
ఇది ఆరోగ్య, అంతర్జాతీయ ప్రయాణ బీమాల ప్రత్యేక కలయిక అని చెప్పవచ్చు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 16 - 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ విద్యార్థులు దీనికి అర్హులు. ప్రయాణ బీమా వ్యవధి 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలు వారి విద్యార్థుల కోసం ప్రయాణ బీమా వివరాల్ని తమ వెబ్సైట్లలో పొందుపరుస్తాయి. మరి కొన్ని విశ్వవిద్యాలయాలు అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా వీటిని తీసుకోవడం తప్పనిసరి చేశాయి. ప్రయాణ బీమా యూఎస్, కెనడాకు కనీసం రూ.1. 50 కోట్లు; యూకే, ఇతర దేశాలకు రూ.37 లక్షల నుంచి రూ.1.50 కోట్ల కవరేజీని కలిగి ఉంటుంది.
స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశాన్నీ కవర్ చేస్తుంది. కానీ దీని బీమా కవరేజీ అమౌంట్ ఒక దేశం నుంచి మరో దేశానికి మారుతుంది. ఉదాహరణకు, ఇతర దేశాలతో పోల్చినప్పుడు అమెరికాలో వైద్య సహాయం ఎక్కువగా ఉంటుంది. కనుక కవరేజీతో పాటు ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది.
చిన్నపిల్లలకు బీమా వర్తిస్తుందా?
ప్రయాణ బీమా పాలసీ 18 ఏళ్లలోపు పిల్లలకు కూడా కవరేజీని అందిస్తుంది. ఇది వారు ప్రయాణించే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో లగేజీ చోరీకి గురి కావడం, మెడికల్ ఖర్చులు, వారు తప్పిపోతే వారిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి అయ్యే ఖర్చు, కరోనా వైరస్ ఖర్చులు ఉంటాయి.