Stock Market Today June 14, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 181 పాయింట్లు లాభపడి 76,992 వద్ద లైఫ్ టైమ్ హై రికార్డ్ వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 66 పాయింట్లు వృద్ధి చెంది 23,465 వద్ద జీవన కాల గరిష్ఠాలను టచ్ చేసి స్థిరపడింది. మదుపరులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లను భారీ స్థాయిలో కొనడమే ఇందుకు కారణం.
- లాభపడిన స్టాక్స్ :ఎం అండ్ ఎం, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్
- నష్టపోయిన షేర్స్ :టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ
ఎగుమతులు పెరిగాయ్
శుక్రవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2024 మే నెలలో భారతదేశ సరకుల (మర్చండైస్) ఎగుమతులు 9 శాతం పెరిగి 38.13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచింది. దీనితో శుక్రవారం దేశీయ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో లాభపడ్డాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, భారతదేశం చేసుకుంటున్న దిగుమతులు కూడా భారీగానే పెరిగాయి. 2023 మే నెలలో 57.48 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంటే, 2024 మే నాటికి 61.91 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకున్నాం.
ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై లాభాలతో ముగిశాయి. హాంకాంగ్ మాత్రం నష్టాలతో స్థిరపడింది. ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిసిన విషయం తెలిసిందే.