Stock Market Close Today April 29, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, బ్యాంకింగ్, ఆటో, మెటల్ స్టాక్స్ రాణించడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 941 పాయింట్లు లాభపడి 74,671 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 223 పాయింట్లు వృద్ధి చెంది 22,643 వద్ద స్థిరపడింది.
- లాభపడిన స్టాక్స్ : ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, టీసీఎస్
- నష్టపోయిన షేర్స్ : హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, విప్రో, బజాజ్ ఫిన్సెర్వ్
యూఎస్ పదేళ్ల రాబడిలో తగ్గడం, అలాగే అమెరికన్ టెక్ కంపెనీల త్రైమాసిక ఆదాయాలు తగ్గడం వల్ల, ఇండియన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లన్నీ పుంజుకున్నాయి. దేశీయంగా చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ నాల్గో త్రైమాసికంలో మంచి పనితీరును కనబరిచింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవన్నీ ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం 3,408.88 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు.
ఆసియా మార్కెట్లు
Asian Markets Today April 29, 2024 : ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై, హాంకాంగ్ లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్ల ట్రేడింగ్ మిశ్రమంగా కొనసాగుతోంది. శుక్రవారం వాల్ స్ట్రీట్ లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.