Stock Markets Today June 4th, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. కొందరు మదుపరులు నిన్న వచ్చిన భారీ లాభాలను స్వీకరిస్తుంటే, మరికొందరు ఎన్నికల ఫలితాలు వచ్చే వేళ ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1572 పాయింట్లు నష్టపోయి 74,936 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 475 పాయింట్లు కోల్పోయి 22,788 వద్ద కొనసాగుతోంది.
ఎన్డీఏ లీడింగ్‌లో ఉన్నప్పటికీ
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అలాగే ఎన్డీఏ కూటమికి భారీ స్థాయిలో సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ ప్రస్తుతానికి ఆ జోష్ కనిపించడం లేదు. ఎన్నికల కౌంటింగ్‌లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి, ఇండియా బ్లాక్ కంటే స్వల్ప ఆధికంలో మాత్రమే ఉంది. ఒకవేళ బీజేపీకి అనుకున్నంత స్థాయిలో సీట్లు రాకపోతే, కూటమిలోని మిగతా పార్టీలపై ఆధారపడాల్సి వస్తుంది. అంటే బీజేపీ నిర్ణయాధికారం బాగా తగ్గుతుంది. ఇది సంస్కరణలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.6,850.76 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హాంకాంగ్ మాత్రమే లాభాల్లో కొనసాగుతోంది. సోమవారం యూఎస్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిసిన విషయం తెలిసిందే.