Stock Market Investment Tips :దేశంలో లోక్ సభ ఎన్నికలు దశలవారీగా జరుగుతున్న నేపథ్యంలో, స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు తీవ్రమైన నిరాశతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కొనసాగించాలా? వద్దా? అనే సందిగ్ధం చాలా మందిని వేధిస్తోంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ సూచీలకు వస్తున్న నష్టాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మదుపరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇదే సరైన సమయమా?
కరోనా తరువాత స్టాక్ మార్కెట్లు క్రమంగా లాభపడుతూనే వస్తున్నాయి. కొన్ని స్టాక్స్ అయితే జీవన కాల గరిష్ఠాలను తాకి వెనక్కు వస్తున్నాయి. ప్రధానంగా రెండు మూడేళ్ల క్రితం నుంచి ఇన్వెస్ట్ చేసినవారి ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలు 25-30 శాతం వరకు లాభాలు తెచ్చిపెట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం షేర్ మార్కెట్లో కొంత అనిశ్చితి నెలకొంది. అందువల్ల పెట్టుబడులను సర్దుబాటు చేసుకునేందుకు ఇదే సరైన సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మంచి పనితీరు కనబరుస్తున్న కంపెనీలను, ఫండ్లను ఎంచుకోవడానికి ఇదే సరైన అవకాశమని చెబుతున్నారు.
సరైన కారణంతోనే!
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కాస్త గందరగోళం ఉన్న మాట వాస్తవమే. కానీ ఇదే కారణంగా చూపి పెట్టుబడులను ఉపసంహరించుకోనవసరం లేదు. షేర్ మార్కెట్లో స్వల్పకాలంలో ఒడుదొడుకులు సహజం. కనుక దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. లేదా బలమైన కారణం ఉంటేనే, మీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి.
వైవిధ్యం ఉండాలి!
కరోనా సంక్షోభం తరువాత స్టాక్ మార్కెట్లు ఇస్తున్న లాభాలను చూసి, చాలా మంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోనూ, నేరుగా షేర్లలోనూ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పెట్టుబడుల్లో కచ్చితంగా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ ఒకే పథకంలో మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేయడం ఏమాత్రం మంచిది కాదు. అందుకే మీ పోర్ట్‌ఫోలియోలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు, ఫండ్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు.
మీ లక్ష్యం, పెట్టుబడి వ్యవధి ఆధారంగా సరైన పథకాలను ఎంచుకోవాలి. అప్పుడే నష్టభయం తగ్గుతుంది. లాభాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. వృద్ధి అవకాశాలు, నాణ్యత అధారంగా సరైన షేర్స్, ఫండ్స్ ఎంచుకోవాలి. ప్రధానంగా మీ పెట్టుబడుల్లో 15%-20% వరకూ అంతర్జాతీయ ఫండ్లకు కేటాయించాలి. కనీసం 10-15% వరకు డెట్ ఫండ్లకు మళ్లించాలి. ఓ 10 శాతాన్ని బంగారంలో మదుపు చేయాలి. ఇలా చేయడం వల్ల ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు వచ్చినప్పుడు కూడా మీకు కొంత మేర సురక్షితంగా ఉండగలుగుతారు. ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్ల లాంటి పాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు కూడా ప్రయత్నించాలి.
సమీక్షించుకోండి!
మీ పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు సూచీల్లో వృద్ధి కారణంగా, మీ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగిపోవచ్చు. అలాంటప్పుడు వీటిలో కొంత భాగాన్ని వెనక్కు తీసుకుని, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించడం మంచిది.