Stock Market Close Today October 28, 2024 :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. దీనితో మదుపరులు మంచి లాభాలు గడించారు. వరుస 5 రోజుల నష్టాల తరువాత, విలువైన కంపెనీల స్టాక్‌లు చాలా తక్కువ ధరకు దొరుకుతున్న నేపథ్యంలో మదుపరులు వాటిని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. దీనికి తోడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. ఓవైపు ఎఫ్‌ఐఐలు పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉంటే, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇది కూడా దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారింది.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 602 పాయింట్లు లాభపడి 80,005 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 186 పాయింట్లు వృద్ధి చెంది 24,367 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, హిందూస్థాన్ యూనిలివర్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ
- నష్టపోయిన షేర్లు : యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి సుజుకి
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,036.75 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.4,159.29 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.