Stock Market Close July 23, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొని, చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. బడ్జెట్ 2024లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై పన్ను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించడమే ఇందుకు కారణం.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 1200 పాయింట్లు, నిఫ్టీ 435 పాయింట్లు మేర నష్టపోయాయి. అయితే బడ్జెట్లో పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపులు ప్రకటించిన తరువాత, స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. ముఖ్యంగా కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ షేర్లు బాగా లాభపడ్డాయి.
చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 80,429 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ 30 పాయింట్లు కోల్పోయి 24,479 వద్ద ముగిసింది.
- లాభపడిన స్టాక్స్ : టైటాన్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, టీసీఎస్, కోటక్ బ్యాంక్
- నష్టపోయిన షేర్స్ : ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సెర్వ్, ఏసియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్
మదుపరులపై ఎఫెక్ట్
'మార్కెట్ల దృక్కోణంలో చూస్తే స్వల్పకాలిక మూలధ లాభాలపై (ఎస్టీసీజీ) పన్ను 20 శాతానికి పెంచడం; దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్టీసీజీ) పన్ను 12.5 శాతానికి పెంచడం చాలా ప్రతికూలమైన అంశం. అయినప్పటికీ మదుపరులు ఈ విషయంలో కాస్త ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది' అని సిట్రస్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సంజయ్ సిన్హా అన్నారు.
బడ్జెట్ కేటాయింపులు
బడ్జెట్లో నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను మినహాయింపు, రానున్న 5 ఏళ్లలో ఉపాధి కల్పనకు రూ.2 లక్షల కోట్లు కేటాయించారు. తమ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారి కోసం బాగానే నిధులు కేటాయించారు. దీనితో పాటు గ్రామీణాభివృద్ధి కోసం రూ.2.66 లక్షల కోట్లు ప్రకటించారు. దీర్ఘకాలిక మౌలిక వసతుల ప్రాజెక్టులపై రూ.11.11 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. దీనితో మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుని, ఫ్లాట్‌గా ముగిశాయి.