తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ పిల్లల భవిష్యత్ కలల కోసం పొదుపు ఎంతో ముఖ్యం- ప్లాన్ చేసుకోండి ఇలా! - Investment For Childrens Education - INVESTMENT FOR CHILDRENS EDUCATION

Investment For Childrens Education : పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో తల్లిదండ్రుల్లో వారి భవిష్యత్​పై ఆందోళన నెలకొంటుంది. దీర్ఘకాలిక​ లక్షాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే పెట్టుబడులు పెడితే, రేపటి రోజు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అందుకే మీ చిన్నారుల కలలను నిజం చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Investment For Childrens Education
Investment For Childrens Education (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 10:20 PM IST

Investment For Childrens Education : పిల్లలకు బడిలో చేరింది మొదలు, ఉన్నత విద్య వరకూ అంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఆర్థికంగా ఇదొక సవాలు లాంటిదే. తమ పిల్లలు వృద్ధిలోకి రావడానికి తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వారి భవిష్యత్‌ కలలను నెరవేర్చేందుకు కష్టపడుతుంటారు. అందుకోసం అవసరమైన డబ్బును సమకూర్చేందుకు ఉన్నంతలో పెట్టుబడులు పెడుతుంటారు. పెద్దల ఆర్థిక లక్ష్యాల్లో పిల్లల చదువులే ముందుంటాయని ఎన్నో నివేదికలూ స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారుల కలలను నిజం చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో చదువుల ఖర్చులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఖర్చులను తప్పించుకునే పరిస్థితులు లేవు. అవసరమైన మొత్తాన్ని కూడబెట్టే క్రమంలో చిన్న పొరపాటు చేసినా, రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరడమూ కష్టంగా మారుతుంది. అది పిల్లల ఉన్నత భవిష్యత్‌పై పెను ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, పిల్లల చదువుల కోసం మదుపు చేసేటప్పుడు వీలైనంత వరకూ జాగ్రత్తలు తీసుకోవాలి.

భవిష్యత్తు అంచనాతో పెట్టుబడులు
పాఠశాల నుంచి మొదలకొని ఉన్నత విద్య వరకూ ఎప్పటికప్పుడు ఫీజులు పెరుగుతూనే ఉండటం చూస్తున్నాం. చాలామందికి ఇవి భారంగానే మారుతున్నాయి. వీటిని తట్టుకునేందుకు పెట్టుబడులు మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఇప్పటి ఖర్చులకు అనుగుణంగానే మదుపు చేస్తే కుదరదు. భవిష్యత్‌లో పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. డబ్బు విలువను హరించే ద్రవ్యోల్బణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. ప్రస్తుతం ఉన్నత చదువుకు రూ.10లక్షలు ఖర్చవుతుందనుకుంటే. 10-15 ఏళ్లకు ఈ మొత్తం ఏ మాత్రం సరిపోదు. ఏడాదికి కనీసం 5 శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసుకున్నా, 15 ఏళ్లనాడు రూ.21 లక్షల వరకూ అవసరం పడతాయి. అందుకే, భవిష్యత్తు అంచనాతోనే పెట్టుబడులు ప్రారంభించాలి. సిప్‌ ద్వారా చిన్న మొత్తాలతోనైనా మదుపు చేయడం మొదలు పెట్టాలి. కేవలం ఆలోచన ఉంటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దానికి విలువ అనేది మర్చిపోవద్దు. లక్ష్యం సాధించేందుకు అవసరమైన మదుపు ప్రణాళికలు వేసుకోవాలి.

ప్రీమియం వైవర్‌ రైడర్‌
పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని బీమా సంస్థలు కొన్ని ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చాయి. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పథకాలనూ అందిస్తున్నాయి. వీటిని పరిశీలించవచ్చు. ఇవి పూర్తిగా పిల్లల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన పథకాలు. పిల్లల పాలసీ తీసుకునేటప్పుడు ప్రీమియం వైవర్‌ రైడర్‌ను ఎంచుకోవడం మర్చిపోవద్దు.

ఈ పొరపాటు చేయొద్దు
డబ్బును జమ చేసే లక్ష్యం ఒకటి దాన్ని వినియోగించే అవసరం మరోటి అన్నట్లు ఉంటుంది కొన్నిసార్లు. పిల్లల చదువుల కోసం పెట్టుబడి విషయంలో ఇలాంటి పొరపాటు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయొద్దు. కొన్ని రోజులయ్యాక మళ్లీ జమ చేస్తాం అంటే ఆ రోజులు ఎప్పటికీ రాకపోవచ్చు. డబ్బును ఖర్చు చేసినంత తేలిక కాదు జమ చేయడం అన్నది గుర్తుంచుకోవాలి. పైగా చక్రవడ్డీ ప్రయోజనాన్నీ కోల్పోతాం. మీ పెట్టుబడి ప్రాధాన్యాలను గుర్తించండి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోండి. అప్పుడే పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవచ్చు.

ఆలస్యం వేయొద్దు
పిల్లల ఉన్నత చదువులకు ఇంకా చాలా సమయం ఉంది కదా! అని అనుకుంటారు చాలామంది. కానీ, సమయం గిర్రున తిరిగిపోతుంది. అందుకే ఇప్పటి నుంచే ఆలోచిస్తేనే ఆ రోజులు వచ్చినప్పుడు ఇబ్బందులు ఉండవు. ఆలస్యం చేసే కొద్దీ పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం విలువ పెరుగుతుంది. పైగా అనుకున్న మొత్తం రాకపోవచ్చు కూడా. దీర్ఘకాలానికి మదుపు చేసినప్పుడే చక్రవడ్డీ ప్రభావం వల్ల మన పెట్టుబడులు వృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయి. వివాహం అయిన వెంటనే పిల్లల కోసం ప్రత్యేక ఆర్థిక ప్రణాళిక ఉండాలి. బిడ్డ పుట్టగానే మీ సంపాదనలో కనీసం 5-10 శాతం సిప్‌ చేయడం ప్రారంభించాలి. నెలకు రూ.10వేలు 15 శాతం రాబడి వచ్చేలా మదుపు చేస్తే 20 ఏళ్లలో రూ.1.30 కోట్ల నిధి జమ అవుతుంది. అదే 10 ఏళ్లు ఆలస్యంగా మదుపు ప్రారంభిస్తే, రూ.26.34 లక్షలు మాత్రమే జమ అవుతాయి. ఆలస్యం చేస్తున్న కొద్దీ పెట్టుబడిపై వచ్చే రాబడి తగ్గిపోతుంది. అందుకే, దీర్ఘకాలిక లక్ష్యాలతోనే మదుపు చేయాలి.

ఒకే పథకంలో వద్దు
పెట్టుబడుల్లో ఎప్పుడూ వైవిధ్యం ఉండాలి. ఒకే పథకంలో మొత్తం డబ్బును దాచి పెట్టడం ఎప్పుడూ మంచిది కాదు. నష్టం వచ్చే అవకాశాలూ ఉంటాయి. పిల్లల భవిష్యత్‌ కోసం మదుపు చేసే చాలామంది తల్లిదండ్రులు ఒకే పథకాన్ని నమ్ముకుంటారు. దీనివల్ల ఆశించిన మేరకు రాబడిని ఆర్జించడం కష్టం అవుతుంది. దీర్ఘకాలం కోసం పెట్టుబడులను ఎంచుకున్నప్పుడు వివిధీకరణకే ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లల లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టేందుకు 15-20 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఈ గడువులో మంచి లాభాలు సంపాదించాలంటే మన పోర్ట్‌ఫోలియో బలంగా నిర్మించుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో 60-70 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించాలి. మిగతా 30-40 శాతం వరకూ డెట్‌ పథకాలు, స్థిరాస్తి, బంగారం వంటి వాటికి మళ్లించాలి. దీనివల్ల పెట్టుబడులు స్థిరంగా వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది.

ముందుగా ధీమా
పెట్టుబడులు ప్రారంభించే ముందు తల్లిదండ్రులు తగిన ఆర్థిక రక్షణ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా పిల్లల చదువులు,వారి ఇతర బాధ్యతలను తీర్చేందుకు అనుకులమైన బీమా పాలసీలు తీసుకోవాలి. సంపాదించే వ్యక్తి తన పేరుమీద వార్షికాదాయానికి కనీసం 10-12 శాతం వరకూ జీవిత బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. కుటుంబానికి అంతటికీ వర్తించేలా కనీసం రూ.10లక్షల ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం ఉత్తమం. అప్పుడే పిల్లల చదువులకు కేటాయిస్తున్న డబ్బును ఇతర అవసరాలకు మళ్లించాల్సిన అవసరం ఏర్పడదు.

పిల్లల యూట్యూబ్ నియంత్రణ పేరెంట్స్ చేతిలో- సరికొత్త ఫీచర్ యాక్టివేట్ చేసుకోండిలా! - Youtube Teenage Safety Feature

స్టేట్, CBSE, ICSE సిలబస్ - మీ పిల్లలకు ఏ స్కూల్ బెస్ట్? - మీకు తెలుసా?? - Best School Board For Child

ABOUT THE AUTHOR

...view details