S&P India's Growth Forecast : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత్ 6.8 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తన అంచనాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్&పీ) స్పష్టం చేసింది. అక్టోబరులో జరిగే ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తన తాజా ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో ఈ మేరకు ఎస్&పీ పేర్కొంది.
'వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం'
2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.9 శాతం వద్దే ఉంచింది ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్. భారతదేశంలో పటిష్ఠమైన వృద్ధిరేటు రిజర్వ్ బ్యాంక్ తన లక్ష్యాలకు అనుగుణంగా ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. "భారత్‌లో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనా 6.8 శాతం. ఆర్బీఐ అక్టోబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని మేము భావిస్తున్నాం. ఆర్బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని వడ్డీ రేట్ల తగ్గింపునకు అడ్డంకిగా పరిగణిస్తోంది. ఆహార ధరల పెరుగుదల తగ్గితే తప్ప, ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కొనసాగించడం చాలా కష్టమని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 4.5 శాతంగా ఉంటుంది" అని ఎస్ అండ్ పీ తెలిపింది.