తెలంగాణ

telangana

జియో దెబ్బకు షాక్​లో గూగుల్‌, యాపిల్‌ - త్వరలో క్లౌడ్‌ స్టోరేజ్​ ధరలు తగ్గే అవకాశం? - Reliance Jio Cloud Storage Offer

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 3:47 PM IST

Reliance Jio Free Cloud Storage Offer : ముకేశ్ అంబానీ జియో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీపావళి నుంచి 100జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గూగుల్‌, యాపిల్‌ కంపెనీలు తమ క్లౌడ్ సేవల ధరలు తగ్గించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

cloud storage
cloud storage (ETV Bharat)

Reliance Jio Free Cloud Storage Offer :రిలయన్స్‌ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్‌ అంబానీ జియో యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. దీపావళి నుంచి 100 జీబీ వరకూ క్లౌడ్‌ స్టోరేజ్​ను (Jio Cloud Storage) వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. దీనితో ఈ విభాగంలో మార్కెట్ లీడర్లుగా ఉన్న గూగుల్, యాపిల్ కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. కనుక క్లౌడ్ స్టోరేజ్‌ విభాగంలో గూగుల్‌ వన్​, యాపిల్‌ ఐక్లౌడ్​ (iCloud) సేవల ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సమస్య తీరినట్లేనా?
ఆండ్రాయిడ్‌, యాపిల్‌ యూజర్లు చాలా స్టోరేజ్​ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ యూజర్లలో ఎక్కువ మంది గూగుల్‌ ఉచితంగా అందిస్తున్న 15 జీబీ డేటా పరిమితి కాగానే, అదనపు స్టోరేజ్​ కోసం గూగుల్‌ వన్‌ను సబ్​స్క్రైబ్​ చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గూగుల్‌ వన్‌ 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్​ ధర నెలకు రూ.130 ఉంది. యాపిల్​ కంపెనీకి చెందిన 'ఐక్లౌడ్‌' 50 జీబీ స్టోరేజ్​ ధర రూ.75గా ఉంది. జియో ఎంట్రీతో ఈ రెండింటి ధరలు భారీగా దిగివచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రిలయన్స్‌ 47వ వార్షిక సాధారణ సమావేశంలో అంబానీ క్లౌడ్‌ సేవల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి డిజిటల్‌ కంటెంట్‌ను జియో యూజర్లు భద్రంగా దాచుకునేలా జియో క్లౌడ్‌ స్టోరేజ్​ను తీసుకురాబోతున్నాం. వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్​ను ఉచితంగా అందించనున్నాం. ఇంకా ఎక్కువ క్లౌడ్‌ స్టోరేజ్​ కావాలనుకునే వాళ్లకి అందుబాటు ధరల్లోనే దానిని అందిస్తాం" అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.

జియో మాస్టర్​ ప్లాన్​
రైడ్‌ అగ్రిగేటర్‌ అయిన ఓలా క్యాబ్స్‌ తొలుత మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ క్లౌడ్‌ సేవల నుంచి వైదొలిగింది. తర్వాత గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి కూడా నిష్క్రమించింది. ప్రస్తుతం సొంతంగా తీసుకొచ్చిన ఓలా మ్యాప్స్‌ వాడుతోంది. దీనితో ఏటా రూ.100 కోట్లు ఆదా అయినట్లు ఓలా సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. దీంతో గూగుల్‌ మ్యాప్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని డెవలర్ల కోసం గూగుల్‌ మ్యాప్స్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా క్లౌడ్​ సేవల ధరలను 70 శాతం తగ్గించింది. ఓలా, మ్యాప్‌ మై ఇండియా వంటి సంస్థలు బిగ్‌ టెక్‌ కంపెనీలకు సవాలు విసురుతున్న వేళ జియో ప్రకటన వెలువడింది. ఇంత తీవ్రమైన పోటీ నెలకొన్న వేళ క్లౌడ్‌ స్టోరేజ్​ ధరలను ఆయా కంపెనీలు తగ్గించే అవకాశం ఉందన్న విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీపావళి నుంచి జియో ఏఐ క్లౌడ్​, జియో బ్రెయిన్ - ఏఐ ఫోన్ కాల్స్ కూడా!

గూగుల్ డ్రైవ్‌ నిండిపోయిందా? ఈ 5 క్లౌడ్ బ్యాకప్ టూల్స్ ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details